సాక్షి, చైన్నె : తంజావూరు జిల్లా కుంభకోణం స్కూల్ అగ్నిప్రమాదం మిగిల్చిన వేదన తల్లిదండ్రుల్ని వెంటాడుతున్నాయి. ఈ విషాద ఘటనకు గురువారం 22 ఏళ్లు కావడంతో తమ పిల్లలు ఆశువులు బాసిన ప్రదేశంలో పుష్పగుచ్చాలను ఉంచి నివాళులర్పించారు. మృతి చెందిన పిల్లల కుటుంబాలలోని వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలన్న నినాదం తాజాగా తెర మీదకు వచ్చినట్లయ్యింది. వివరాలు.. తంజావూరు జిల్లా కుంభకోణం కాశీరామన్ వీధిలోని శ్రీ కృష్ణ ఎయిడెడ్ ప్రైమరీ స్కూల్‌లో 2004 జూలై 16న సంభవించిన అగ్నిప్రమాదంలో 94 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. మరో 18 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన జరిగి 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ప్రమాదం జరిగిన పాఠశాల భవనం ముందు మృతుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే పాలక్కరైలోని స్మారక మండపం వద్ద పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తమ పిల్లల చిత్రపటాలను చూస్తూ, వారికి ఇష్టమైన తినుబండారాలను ఉంచి తల్లులు కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడి వారిని కలచివేసింది. ఈ వర్ధంతి సందర్భంగా మరణించిన పిల్లల చిత్రాలతో కూడిన భారీ డిజిటల్ ఫ్లెక్సీని పాఠశాల ముందు ఏర్పాటు చేశారు. దీనికి తల్లిదండ్రులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు, పాఠశాల పూర్వ విద్యార్థులు పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. సాయంత్రం మహామహం కోనేరులో మోక్ష దీపాలు వెలిగించారు. నివాళులర్పించిన వారిలో డిఎంకె తంజావూరు ఉత్తర జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే సాకోట్టై కె. అన్బళగన్, డీఎంకే మాజీ మంత్రి, తిరువిడైమరుదూర్ ఎమ్మెల్యే గోవి చెలియన్, మాజీ ఎంపీ రామలింగం, కుంభకోణం కార్పొరేషన్ మేయర్ శరవణన్, డిప్యూటీ మేయర్ తమిళళగన్, కమిషనర్ సుధ, సిపిఐ జిల్లా కార్యదర్శి భారతి, సిపిఎం కార్యదర్శి చిన్నై పాండ్యన్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుమరన్, నగర అధ్యక్షుడు మిర్జావుద్దీన్, టివికె నగర కార్యదర్శి మురుగానందం, మానవర్ అరన్ సంక్షేమ సంస్థ తమిళనాడు అధ్యక్షుడు సైమన్ తదితర అధికారులు, రాజకీయ ప్రముఖులు ఉన్నారు.
బాధిత కుటుంబాల డిమాండ్లు
21 ఏళ్లుగా కేవలం నివాళులర్పించే కార్యక్రమాలు జరగ్గా, తాజాగా బాధితకుటుంబాలనుంచికొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. కరూర్ మృతులకుటుంబాలకు ఏవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారో, అదే తరహాలో తమకు ఉద్యోగాలు ఇవ్వాలన్న నినాదాన్ని అందుకున్నారు. అగ్నిప్రమాదంలో మరణించిన సుస్మిత సోదరి మధుమిత మాట్లాడుతూ, ఈ ఘోరం జరిగి 22 ఏళ్లు గడిచినా ఆ గాయం మాన లేదన్నారు. ప్రతి సంవత్సరం జూలై 16న ఈ ప్రాంతంలో అంజలి ఘటించడానికి వచ్చేటప్పుడు ప్రజలకు, ఇతర విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని తాము భావిస్తామన్నారు. ఈ విషాదకర రోజును కుంభకోణం సర్కిల్‌కు స్థానిక సెలవు దినంగా ప్రకటించాలని గత 22 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నామన్నారు. తదుపరి సంవత్సరమైనా తమ విజ్ఞప్తిని తాజా సీఎం పరిగణిస్తారని భావిస్తున్నామన్నారు. మానవర్‌అరన్ సంస్థ అధ్యక్షుడు సైమన్ మాట్లాడుతూ, జూలై 16వ తేదీని బాలల హక్కుల రక్షణ దినోత్సవంగా ప్రకటించాలని , ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన స్మారక పార్కును వెంటనే పునరుద్ధరించాలని కోరారు.
ప్రమాదంలో తన ఇద్దరు పిల్లలను కోల్పోయిన ఇన్బరాజ్ అనే తండ్రి మాట్లాడుతూ, ఇటీవల కరూర్‌లో ఒక ఘటనలో 41 మంది మరణించినప్పుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ బాధిత కుటుంబాలకు అర్హతను బట్టి ఉపాధి అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. . అదేవిధంగా చదువుకోవడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన తమ పిల్లల కుటుంబాలకు కూడా అర్హత ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కుంభకోణం ఎమ్మెల్యే, వ్యవసాయ శాఖ మంత్రి వినోద్ ద్వారా సీఎం విజయ్ కలిసి తమ విజ్ఞప్తిని నేరుగా తెలియజేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.


