సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేలో అంతర్గత కలహాలు మరింత ముదిరాయి. ఈ క్రమంలో పార్టీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న మైలం ఎమ్మెల్యే, సీనియర్‌నేత సీవీషణ్ముగం మద్దతుదారులపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి కన్నెర్ర చేశారు. కొత్తగా విల్లుపురం జిల్లా కార్యదర్శిగా నియమితులైన పశుపతి మద్దతుదారులకు, మాజీ మంత్రి సి.వి. షణ్ముగం మద్దతుదారులకు మధ్య గత కొద్ది రోజులుగా విల్లుపురంలో తీవ్ర ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. దిండివనం, సెంజి ప్రాంతాలలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఇరువర్గాల మధ్య ఘర్షణలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఈ పరిస్థితులలో క్రమశిక్షణ ఉల్లంఘన ఆరోపణలపై సి.వి. షణ్ముగం మద్దతుదారులుగా భావిస్తున్న 11 మంది కీలక నిర్వాహకులను వారి పార్టీ పదవుల నుండి తక్షణమే తొలగిస్తున్నట్లు పళణి స్వామి ప్రకటించారు. వీరిలో విల్లుపురం జిల్లా ఆనంది (సంయుక్త కార్యదర్శి),కె.వి.ఎన్. వెంకటేశన్ (జిల్లా కోశాధికారి), జయప్రకాష్ (జిల్లా యువజన విభాగం కార్యదర్శి), భాస్కరన్ (జిల్లా కార్మిక సంఘం కార్యదర్శి) వల్లం సౌత్ యూనియన్ కార్యదర్శి నటరాజన్ , మైలం వెస్ట్ యూనియన్ కార్యదర్శి విజయన్,ఒలకూరు వెస్ట్ యూనియన్ కార్యదర్శి కృష్ణమూర్తి, ఒలకూరు ఈస్ట్ యూనియన్ కార్యదర్శి పన్నీర్, దిండివనం నగర కార్యదర్శి రూపన్‌రాజ్, మైలం వెస్ట్ యూనియన్ ఎంజీఆర్ ఫోరం కార్యదర్శి సెంథిల్‌కుమార్ ఉన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బలాన్ని నిరూపిస్తాం..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వివిధ జిల్లాల నిర్వాహకులతో గత కొద్ది రోజులుగాసమీక్షా సమావేశాలు నిర్వహిస్తూవస్తున్నారు. తాజాగా పుదుకోట్టై, కడలూరు, తేని తదితర జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల ఓటమితో ఎవరూ నిరుత్సాహపడవద్దని, పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని పళణి వ్యాఖ్యలు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుని కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపు నిచ్చారు. నిరుత్సాహం వద్దు అని, స్థానిక ఎన్నికలలో బలంచాటుదామన్నారు. ఇక, 18వ తేదీన కరూర్, నీలగిరి, విరుదునగర్, 20వ తేదిన మదురై, రామనాథపురం, 21న తెన్కాసి, కన్యాకుమారి, తూత్తుకుడి, తిరుప్పూర్, నామక్కల్, ఉత్తర చైన్నె జిల్లాలు, 23న కోయంబత్తూరు, దిండిగల్ జిల్లాలు, 24న విల్లుపురం, తిరువారూర్, సేలం జిల్లాలు., 25న కళ్లకురిచ్చి,చైన్నె, తిరువళ్లూరు దక్షిణం జిల్లాల నేతలతో పళణిస్వామి సమావేశం కానున్నారు.


