సాక్షి, చైన్నె: ప్రభుత్వంలో భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. విద్యుత్ బోర్డు ఛైర్మన్‌తో సహా మొత్తం 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తమిళనాడు విద్యుత్‌బోర్డు చైర్మన్‌గా ఉన్న జె. రాధాకృష్ణన్‌ను అన్నా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ శిక్షణ విభాగానికి ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బదిలీ అయ్యారు. అలాగే ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అరుణ్ రాయ్‌ను విద్యుత్ బోర్డుకు నియమించారు. అటవీ శాఖ కార్యదర్శిగా పనిచేసిన సుప్రియా సాహూ, వ్యవస్థాపక అభివృద్ధి ఆవిష్కరణ సంస్థల కమిషనర్‌గా బదిలీ అయ్యారు. అటవీ శాఖ కార్యదర్శిగా అతుల్ ఆనంద్ నియమితులయ్యారు. ప్రజా ,పునరావాస శాఖ ప్రత్యేక కార్యదర్శి సుందరవల్లి అదే శాఖకు పదోన్నతిపై కార్యదర్శిగా నియమితులయ్యారు. రవాణా శాఖ కార్యదర్శి వల్లలార్ కార్మిక సంక్షేమ శాఖ కమిషనర్‌గా బదిలీ అయ్యారు.
కొలత్తూరులో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభం
సాక్షి, చైన్నె : ఉత్తర చైన్నె పరిసర ప్రాంతాల ప్రజలకు పాస్‌పోర్ట్ సేవలను మరింత సులభతరం చేసే దిశగా, కొలత్తూరు (పెరియార్ నగర్) సబ్ పోస్ట్ ఆఫీస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కొత్త పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ను కేంద్ర సమాచార, ప్రసార చ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ గురువారం ప్రారంభించారు. ఈ కేంద్రంలో ప్రాసెస్ చేయబడిన మొట్టమొదటి పాస్‌పోర్ట్‌ను ఒక ఆరు నెలల శిశువు తల్లిదండ్రులకు అందజేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉత్తర చైన్నె డీఎంకే పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ కలానిధి వీరస్వామి, చైన్నె మేయర్ ఆర్. ప్రియ, కొలత్తూరు నియోజకవర్గ తమిళగ వెట్రి కళగం ఎ మ్మెల్యే విఎస్ బాబు, విదేశీ వ్యవహారాల శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇది చైన్నె రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలో ఏర్పాటైన 14వ తపాలా కార్యాలయ పాస్‌పోర్ట్ సేవా కేంద్రంకావడం గమనార్హం.
ఎన్నికల కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు
సాక్షి, చైన్నె : తమిళనాడులో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి విజయ్, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సహా 54 మంది ప్రజాప్రతినిధులపై నమోదైన ఎన్నికల కేసుల విచారణను వేగవంతం చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. తూత్తుకుడి జిల్లాకు చెందిన వెంకటాచలపతి అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం సుప్రీంకోర్టు లో జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ అంశంపై పిటిషనర్ నేరుగా సుప్రీంకోర్టుకు రాకుండా, చైన్నె హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచిస్తూ ఈ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
రంగుల పూసిన అప్పడాలు విక్రయించే దుకాణాలకు నోటీసులు
కొరుక్కుపేట: తమిళనాడులో సహజ రంగులకు బదులుగా కత్రిమ రంగులు కలిపిన అప్పడాలు అమ్మకంపై ఇప్పటికే నిషేధం ఉంది. అయినప్పటికీ, చైన్నెలోని అనేక చోట్ల రంగుల అప్పాలు అమ్ముడవుతున్నాయి. ఈ పరిస్థితిలో, చైన్నెలోని ఆహార భద్రతా అధికారులు దుకాణాలలో తనిఖీలు నిర్వహించగా, కొన్ని దుకాణాలు నిషేధాన్ని ఉల్లంఘించి రంగుల అప్పడాలను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దీని తర్వాత, అధికారులు ఆ దుకాణాలకు నోటీసులు జారీ చేశారు. వారు ఇచ్చే వివరణ ఆధారంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రంగుల బిస్కెట్లు , అప్పడాలు తరచుగా తినడం వల్ల జీర్ణ సమస్యలు, మూత్రపిండాల దెబ్బతినడం, క్యాన్సర్ రావచ్చు. ముఖ్యంగా పిల్లలలో, ఈ రంగుల బిస్కెట్లు తినడం వల్ల అలెర్జీలు , ఏకాగ్రత లోపం వంటివి కలగవచ్చు. సాంప్రదాయబద్ధంగా మినపపప్పు, బియ్యం మొదలైన వాటితో తయారుచేసే అప్పళాన్ని కొని తినడం ఉత్తమం.
వైద్యసీట్ల కోసం 52 వేల మంది దరఖాస్తు
సాక్షి, చైన్నె: ఈ ఏడాది జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)లో తలెత్తిన వివాదాల కారణంగా నిర్వహించిన పునర్ పరీక్షా ఫలితాల విడుదలలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీవ్ర ఆలస్యం చేస్తుండటంతో, తమిళనాడులో వైద్య విద్యా ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగినట్లయ్యింది. గత రెండు వారాలుగా తమిళనాడు వైద్య విద్యా డైరెక్టరేట్ ఆధ్వర్యంలో ఎంబిబిఎస్, డెంటల్ కోర్సుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు సుమారు 52 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, నీట్ తుది ఫలితాలు రాకపోవడంతో దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీని ఇంకా ఖరారు చేయలేదు.
అయోమయంలో విద్యార్థులు
ఫలితాల విడుదల ఆలస్యం కావడం వల్ల మెరిట్ లిస్ట్ తయారీకి కనీసం మరో 10 రోజులు పట్టే అవకాశం ఉంది. ఇది ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియపై కూడా ప్రభావం చూపుతోంది. ఈ ఆలస్యం కారణంగా వైద్య విద్యా సంవత్సరం ప్రారంభం మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


