వేలూరు: దేశ వ్యాప్తంగా ఉన్న నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక నిధులు కేటాయించాలని వేలూరు వీఐటీ యూనివర్సిటీ చాన్స్‌లర్ డాక్టర్ విశ్వనాథన్ తెలిపారు. వేలూరు వీఐటీ యూనివర్సిటీలోని అందరికీ ఉన్నత విద్యా పథకం కింద నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఉదయం జరిగింది. గోల్డన్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ పరిపాలన డైరెక్టర్ మణికంఠన్ జీ మేనన్ హాజరై విద్యార్థులకు చెక్కులను అందజేశారు. విశ్వనాథన్ మాట్లాడుతూ ప్రభుత్వ సాయం లేకుండా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా 2012వ సంవత్సరంలో ప్రారంభించామన్నారు. ప్రస్తుతం 856 మంది విద్యార్థులకు రూ.కోటి 18 లక్షల స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్నత విద్యకు 28 శాతం మంది మాత్రమే వెలుతున్నారని అన్నారు. విద్యలో తమిళనాడు మొదటి రాష్ట్రంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా అభివృద్ధి చెందిన దేశాలతో మనం పోటీ పడాలన్నారు. ట్రస్ట్ సభ్యులు మయిలాంబిగై, కార్యదర్శి లక్ష్మణన్, కోశాధికారి జౌరీలాల్ జైన్, వెంకటసుబ్బు, దేవరాజ్, రచయిత పదుమనార్, కేఎంజీ రాజేంద్రన్, డాక్టర్ నర్మద, అంజు శక్తివేల్ పాల్గొన్నారు.


