తమిళసినిమా: రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న విషయం తెలిసిందే. అధికారం చేపట్టడానికి ఓట్ల వేటలో రాజకీయ నాయకులు ఉన్నారు. ఇలాంటి తరుణంలో సామాజిక రాజకీయాలకు అద్దం పట్టే విధంగా మక్కళ్ తలైవా అనే చిత్రం తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రానికి ఫర్ సేల్ అనే ట్యాగ్‌లైన్ పెట్టడం విశేషం. రవిమరియా ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించారు. రాధారవి, అక్షర విజయ్, పళ కరుప్పయ్య, నాంజల్ సంపత్, దర్శకుడు పేరరసు, గంజాకరుప్పు, పైల్వాన్ రంగనాథన్, దర్శకుడు రంగనాథన్, కవితాలయా శరవణన్, అగ్ని ఎస్.వరుణ్ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి రామ్‌దేవ్ దర్శక త్వం వహించారు. కార్తీక్ కేఎస్.నాయర్ చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం ద్వారా తులసిరామన్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్న ఈ చిత్రం గురించి దర్శకుడు వివరిస్తూ కల్పిత కథతో సమకాలీన రాజకీయాలను వినోదంతో కలిపి రూపొందించిన కథా చిత్రం అని చెప్పారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దివంగత రాజకీయనాయకుడు కామరాజర్ శిష్యుడు తమిళరువి మణియన్ విడుదల చేసినట్లు చెప్పారు. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు.


