స్థానిక సమస్యలు
అవినాశి లింగేశ్వరాలయం
సాక్షి, చైన్నె : వరుస ఓటములను ఎదుర్కొంటున్న కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్‌ను ఈసారి అవినాశి నియోజకవర్గం ఓటర్లు ఆదుకునేనా అనే ఎదురుచూపులు పెరిగాయి. ఆయన్న ఢీకొట్టేందుకు ముగ్గురు మహిళా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. డీఎంకే అభ్యర్థిగా కోకిలామణి, టీవీకే అభ్యర్థిగా కమలి, ఎన్‌టీకే అభ్యర్థిగా మేనక పోటీ చేస్తున్నారు. ఈ రిజర్వుడ్ స్థానంలో ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది.
కొంగు మండలం(పశ్చిమ తమిళనాడు)లో కీలకంగా తిరుపూర్ జిల్లాలో అవినాశి నియోజకవర్గం ఉంది. ప్రసిద్ధ అవినాశిలింగేశ్వర ఆలయం, తిరుమురుగన్ పూండి ఆలయాలకు నెలవైన ఈ ఆధ్యాత్మిక గడ్డలో తాజాగా రాజకీయంగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇది ముమ్మాటికి అన్నాడీఎంకే కంచుకోట. ఒకప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టులు, డీఎంకే తలా ఓ సారి గెలిచాయి. అన్నాడీఎంకే 8 సార్లు విజయ కేతనం ఎగుర వేసింది. వరుసగా ఐదు ఎన్నికలలో అన్నాడీఎంకే తిరుగులేని మెజారిటీతో నియోజకవర్గాన్ని కై వశం చేసుకుంటూ వచ్చింది. 2016లో ఇక్కడి నుంచి గెలిచిన వెనుకబడిన సామాజిక వర్గంకు చెందిన పీ ధనపాల్‌ను అసెంబ్లీ స్పీకర్‌ను చేసిన ఘనత అన్నాడీఎంకే దక్కించుకుంది. ఇక్కడ మొత్తం ఓటర్లు– 2,50,346 ఉన్నారు. ఓటర్లలో ఆది ద్రావిడ, కొంగు వేలాళర్, నాయకర్ , శెట్టియార్ సామాజిక వర్గాలు ఇక్కడ బలంగా ఉండడం గమనార్హం.
మురుగన్ అనుగ్రహం దక్కేనా?
తాజా ఎన్నికలలో పి.ధనపాల్‌ను అన్నాడీఎంకే పక్కన పెట్టింది. అధిష్టానం తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వరుసగా రెండు సార్లు ధనపాల్ గెలిచినా, ఆయన్ను పక్కన పెట్టి ఈ సారి సీటును బీజేపీకి అప్పగించడం అన్నాడీఎంకే వర్గాలే జీర్ణించుకోవడం లేదు. ధనపాల్, స్థానిక అన్నాడీఎంకే నాయకులు అధిష్టానంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ కాలం అన్నాడీఎంకే గుప్పెట్లో ఉన్న ఈ స్థానాన్ని బీజేపీ దక్కించుకుని, ఆ పార్టీ ఓటు బ్యాంక్ ఆధారంగా ఈ సారి కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్‌ను అసెంబ్లీకి పంపించాలన్న లక్ష్యంతో వ్యూహాలకు పదును పెట్టారు. కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే, ధనపాల్ రూపంలో అసమ్మతి సెగ తగిలే అవకాశాలు ఎక్కువే. ధనపాల్ తనయుడు తమిళ్ సెల్వన్ విజయ్ టీవీకేలో చేరడం గమనార్హం.
ప్రత్యర్థులుగా ముగ్గురు నారీ మణులు
కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ ముగ్గురు మహిళా శక్తిని ఎన్నికలలో ఎదుర్కొంటున్నారు. డీఎంకే అభ్యర్థిగా యువ వైద్యురాలు వి. కోకిలామణిని రంగంలోకి దిగారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కాకుండా, రెండాకుల చిహ్నం నియోజకవర్గంలో ఉపయోగించే ఈవీఎంలలో కనిపించే అవకాశం లేని దృష్ట్యా, ఉదయ సూర్యుడికి ఓటర్లు పట్టం కట్టి తనను గెలిపిస్తారన్న ధీమాతో కోకిలా మణి ప్రచారం చేస్త్తున్నారు. ఇక, నామ్ తమిళర్ కట్చి(ఎన్‌టీకే) అభ్యర్థిగా వి. మేనక పోటీ చేస్తున్నారు.తమిళగ వెట్రి కళగం(టీవీకే ) తరఫున ఎస్ కమలి పోటీలో ఉన్నారు.


