తచ్చాంకురిచ్చిలో జల్లికట్టు హోరు
సాక్షి, చైన్నె : తమిళుల సాహస క్రీడ జల్లికట్టు సంబరాలు మొదలయ్యాయి. సంక్రాంతికి ముందుగా తొలి పోటీ పుదుకోట్టై జిల్లా తచ్చాంకురిచ్చిలో శనివారం జరిగింది. రంకెలేస్తున్న ఎద్దులను పట్టుకునే క్రీడాకారులు దూసుకెళ్లారు. ఈక్రమంలో పలువురు గాయపడ్డారు. సంక్రాంతి పర్వదినం సమీపిస్తుండటంతో తమిళుల సాహస క్రీడ జల్లికట్టు ఏర్పాట్లు వేగవంతం అయ్యాయి. ఈ పోటీలకు మదురై జిల్లా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జరిగే పోటీలకే తొలి ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. అయినా, సంవత్సరంలో ప్రారంభ పోటీ అన్నది పుదుకోట్టై జిల్లా గందర్వ కోట్టై సమీపంలోని తచ్చాంకురిచ్చిలో నిర్వహించడం ఆనవాయితీ. ఇక్కడి అన్నై మాత ఆలయం ఉత్సవాలలో భాగంగా ఈ జల్లికట్టు క్రీడ జరుగుతుంది. శనివారం ఉదయం ఈ పోటీలను మంత్రులు రఘుపతి, మెయ్యనాథన్, కలెక్టర్ అరుణలు ప్రారంభించారు. కట్టుదిట్టమైన ఆంక్షలు, భద్రత నడుమ పోటీలు జరిగాయి. మదురై, దిండుగల్, శివగంగై, తిరువారూర్, రామనాథపురం తదితర జిల్లాల నుంచి 900 ఎద్దులు రంకేలేశాయి. కదన రంగంలో వీటిని పట్టుకునేందుకు 300మంది క్రీడాకారులు ఉరకలు తీశారు. ఒక్కో జట్టులో 30 మందిని ఎంపిక చేసి 10 రౌండ్‌లుగా పోటీలు జరిగాయి. బసులు కొట్టిన ఎద్దుల పొగరు అణిచి వేసే విధంగా దూసుకెళ్లిన క్రీడాకారులు పలువురు గాయపడ్డారు. అలాగే ఆక్రోశంతో ఉన్న కొన్ని ఎద్దులను అదుపు చేయలేక పలువురు ఇబ్బందిపడ్డారు. ఈ పోటీలలో విజేతలకు మంచాలు, బంగారు, వెండి నాణెలు, సైకిళ్లు, గృహోపకరణ వస్తువులు, మోటారు సైకిళ్లను బహుమతులుగా అందజేశారు. కాగా, ఓ రౌండ్ పోటీలో ఇరు వర్గాల వివాదంతో పోలీసులు లాఠీలకు పని పెట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చి గట్టి భద్రతా నడుమ పోటీలను నిర్వహించారు. ఇదిలాఉండగా, మదురై జిల్లాలోజల్లికట్టు సంబరాల తేదిలను ప్రకటించారు. అవనియాపురంలో 15వ తేదిన, 16న పాలమేడులో, 17వ తేదీన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అలంగానల్లూరులో జల్లికట్టు సంబరాలు జరగనున్నాయి.


