లంచం కేసులో ముగ్గురి అరెస్ట్
సేలం : నామక్కల్ – తిరుచెంగోడ్ సమీపంలో అనుమతి లేకుండా తాటిచెట్లను నరికేసిన రైతుపై చర్య తీసుకోకుండా ఉండడానికి రూ.20వేలు లంచం తీసుకున్న గ్రామ పరిపాలన అధికారి సహా ముగ్గురిని అరెస్టు చేశారు. నామక్కల్ జిల్లాలోని తిరుచెంగోడ్ సమీపంలోని పుదుపులియంపట్టి ప్రాంతానికి చెందిన రైతు తన భూమిలోని ఆరు తాటిచెట్లను నరికేసినా అతనిపై కేసు నమోదు చేయకుండా ఉండడానికి పుదుపులియంపట్టి గ్రామ పరిపాలనా అధికారి గుణశేఖరన్ రూ.40 వేలు లంచం అడిగాడు. మొదటి విడతలో రూ.20వేలు చెల్లించిన రైతు మరో విడత చెల్లించలేకపోవడంతో వీఏఓ గుణశేఖరన్ మిగిలిన నగదు ఇవ్వాలని ఒత్తిడి పెట్టాడు. దీంతో నామక్కల్ ఏసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు మంగళవారం రసాయనం పూసిన నోట్లను రైతుకు ఇచ్చి ఏసీబీ పోలీసులు పంపారు. గ్రామ పరిపాలనా అధికారి గుణశేఖరన్ బయట ఉన్నాడని, సీహెచ్‌పీ కాలనీలోని విలేజ్ అసిస్టెంట్ దేవి ఇంటికెళ్లి ఆమెకు ఇవ్వాలని చెప్పాడు. దీంతో రైతు తిరుచెంగోడ్ సీఎచ్‌పీ కాలనీలోని విలేజ్ అసిస్టెంట్ దేవి ఇంటికి లంచం ఇచ్చేందుకు అక్కడికి వెళ్లి దేవి భర్త విజయకుమార్‌కు రసాయనం పూసిన నోట్లనుఇచ్చాడు. ఈసమయంలో అక్కడే ఉన్న ఏసీబీ పోలీసులు బీఏఓ గుణశేఖరన్, గ్రామ సహాయకురాలు దేవి, ఆమె భర్త విజయకుమార్‌ను అరెస్టు చేశారు.
లంచం కేసులో ముగ్గురి అరెస్ట్


