చైన్నెలో భారత్ విద్యుత్ సమ్మిట్ రోడ్ షో
సాక్షి,చైన్నె: భారత్ విద్యుత్ సమ్మిట్ 2026 రోడ్ షో బుధవారం చైన్నె జరిగింది. ఢిల్లీ వేదికగా మార్చి 19 నుంచి 22 వరకు ఈ సమ్మిట్ జరగబోతోంది. ఇందుకోసం ఇక్కడి పారిశ్రామిక వేత్తలు, సంస్థల ప్రతినిధులు, నిపుణులను ఆహ్వానించే విధంగా బుధవారం చైన్నెలో రోడ్ షో నిర్వహించారు. వివిధ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. ఇందులో ఈఈపీసీ ఇండియా–న్యూఢిల్లీ సీనియర్ జాయింట్ డైరెక్టర్ చందన్ అవస్థీ మాట్లాడుతూ విద్యుదీకరణ వృద్ధి, స్థిరత్వాన్ని సాధికారపరచడం, ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ చేయడం అనే థీమ్‌తో ఈ సమ్మిట్ జరగనున్నట్టు వివరించారు. న్యూఢిల్లీలోని ద్వారకలోని యశోభూమి వేదికగా భారత్ విద్యుత్ సమ్మిట్ 2026 మార్చి 19 నుంచి 22 వరకు జరుగనుందన్నారు. ఈ సమ్మిట్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ, నిల్వ, స్మార్ట్ వినియోగాన్ని కవర్ చేసే విద్యుత్ వ్యవస్థల భవిష్యత్తును రూపొందించడానికి ప్రపంచ విధాన నిర్ణేతలు, పరిశ్రమ నాయకులు, సాంకేతిక ప్రదాతలు, పెట్టుబడిదారులు నిపుణులను ఒకచోట చేర్చుతుందన్నారు. ఈ సమ్మిట్‌లో 50కి పైగా ఉన్నత స్థాయి సమావేశాలు, 300 మందికి పైగా స్పీకర్లు, 1,000 మంది ప్రతినిధులు, 500లకు పైగా ఎగ్జిబిటర్లు 25,000 మందికి పైగా సందర్శకులు పాల్గొంటారని భావిస్తున్నామన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద విద్యుత్–కేంద్రీకృత వేదికలలో ఒకటిగా నిలుస్తోందన్నారు. భారత్ విద్యుత్ సమ్మిట్ 2026 అనేది విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిశ్రమ నేతృత్వంలోని పవర్ గ్రిడ్ (నోడల్), ఎన్‌టీపీసీ, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ, ఎన్‌హెచ్‌పీసీ ఉమ్మడి మద్దతుతో ఇంజినీరింగ్ ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ (ఈఈపీసీ ఇండియా) ద్వారా సమన్వయం చేయబడుతుందని ఈఈపీసీ ఇండియా డిప్యూటీ రీజనల్ చైర్మన్ శశికిరణ్ లెవీస్ తెలిపారు. ఇందులో పవర్ గ్రిడ్ జయశీలన్, ఎన్‌టీపీసీ పార్థసారథి శ్రీనివాసన్, ఉమర్ ఫరూఖ్ తదితరులు పాల్గొన్నారు.


