రేషన్ దుకాణాలకు చెరకు
తిరుత్తణి: సంక్రాంతి కానుకలు పంపిణీకి వీలుగా కొనుగోలు చేసిన చెరకును వాహనాల్లో రేషన్ దుకాణాలకు సరఫరా చేశారు. రాష్ట్రంలో సంక్రాంతిని ప్రజలు ఉత్సాహంగా కొనియాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.3వేలతోపాటు కేజీ చెక్కెర, బియ్యంతోపాటు చెరకు గడ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆదేశించింది, గురువారం సంక్రాంతి కానుకల పంపిణీకి సీఎం స్టాలిన్ శ్రీకారం చుట్టనున్నారు. ఈక్రమంలో రేషన్ దుకాణాలకు చెరకు సరఫరా కోసం సేలం, ఈరోడ్డు జిల్లాలకు వెళ్లిన సహకార శాఖ అధికారులు చెరకు కొనుగోలు చేసి లారీల్లో తరలించారు. తిరుత్తణి తాలూకాలోని 137 రేషన్ దుకాణాలకు చెరకు సరఫరాకు వీలుగా తిరుత్తణిలోని ప్రభుత్వ సహకార సంఘం వద్ద తీసుకొచ్చిన లారీల నుంచి వ్యాన్‌ల ద్వారా రేషన్ దుకాణాలకు తరలించారు. గురువారం నుంచి రేషన్ దుకాణాల్లో సంక్రాంతి కానుకలు పంపిణీ ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. బహుమతితోపాటు సరుకులు పొందేందుకు వీలుగా రేషన్‌కార్డు దారులకు రేషన్ సిబ్బంది ఇప్పటికే టోకెన్లు పంపిణీ చేశారు.


