ఆర్డర్లీ వ్యవస్థ రద్దు చేయాల్సిందే!
సాక్షి, చైన్నె: పోలీసు శాఖలో ఆర్డర్లీ వ్యవస్థపై హైకోర్టు మరోమారు కన్నెర్ర చేసింది. పూర్తిగా ఈ వ్యవస్థ రద్దయ్యే విధంగా ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పర్యవేక్షణకు కలెక్టర్ల నేతృత్వంలో కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వాన్ని న్యాయమూర్తులు ఆదేశించారు.
పోలీసు శాఖలో ఆర్డర్లీ వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోలీస్‌స్టేషన్లలో కంటే బాసుల ఇళ్ల వద్ద చాకిరి చేసే వారు ఒకప్పుడు అధికం. ఈ వ్యవహారంపై గతంలో హైకోర్టు దృష్టి పెట్టింది. ఈ వ్యవస్థను రద్దు చేసే విధంగా ఆదేశాలు ఇచ్చింది. ఈ వ్యవస్థను రద్దు చేస్తూ డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఇళ్ల వద్దగానీ, క్వార్టర్సుల వద్ద గానీ ఎవ్వరూ ఉండేందుకు వీలు లేదని, అందరూ యూనిఫాం ధరించి విధులకు హాజరు కావాల్సిందేనని హుకుం జారీ చేశారు. అయినా, చాపకింద నీరులా ఆర్డర్లీ వ్యవస్థ అమల్లో ఉన్నట్టుగా కోర్టుకు సమాచారం చేరింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ విచారణకు హైకోర్టులో వచ్చింది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు వాదిస్తూ, ఫిర్యాదు ఇస్తే సంబంధిత అధికారులపై చర్యలకు సిద్ధమని స్పష్టం చేశారు. ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేస్తూ డీజీపీ ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు అభినందించింది. అలాగే, ఈ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఆర్డర్లీ వ్యవస్థ ఎక్కడైనా అమల్లో ఉందాని సమగ్ర పరిశీలన చేయాలని ఆదేశించారు.అలాగే, ఈ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి పర్యవేక్షించేందుకు జిల్లాల స్థాయిలో కలెక్టర్ల పర్యవేక్షణలో కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమగ్ర నివేదికను నాలుగు వారాల్లో దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ కమిటీ రెండు వారాల్లో ఏర్పాటు కావాలని ఆదేశించారు.


