న్యాయమూర్తికి వ్యతిరేకంగా పుస్తకం | - | Sakshi
Sakshi News home page

న్యాయమూర్తికి వ్యతిరేకంగా పుస్తకం

Jan 8 2026 7:05 AM | Updated on Jan 8 2026 7:05 AM

న్యాయమూర్తికి  వ్యతిరేకంగా పుస్తకం

న్యాయమూర్తికి వ్యతిరేకంగా పుస్తకం

– హైకోర్టు ఆగ్రహం

సాక్షి, చైన్నె: న్యాయమూర్తి కి వ్యతిరేకంగా ఓ పుస్తకం రూపుదిద్దుకున్న సమాచారంతో మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పుస్తకం విడుదలను అడ్డుకునే విధంగా, సీజ్‌ చేసేందుకు ఆదేశాలు బుధవారం జారీ చేశారు. వివరాలు.. మదురై జిల్లా తిరుప్పకుండ్రంలో కార్తిక దీపం వ్యవహారం రచ్చకెక్కిన విషయం తెలిసిందే. మదురై ధర్మాసనం సింగిల్‌ బెంచ్‌ జడ్జి జీఆర్‌ స్వామినాథన్‌ ఇచ్చిన ఉత్తర్వులతో వివాదం మరింతగా రాజుకుంది. ఈ పరిణామాలను వివరించే విధంగా ఓ పబ్లికేషన్‌ పుస్తకాన్ని ముద్రించింది. గురువారం నుంచి చైన్నెలో ప్రారంభం కానున్న పుస్తక ప్రదర్శనలో దీనిని ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. అలాగే ప్రత్యేక కౌంటర్‌ సైతం ఈ పుస్తకం విక్రయానికి ఏర్పాటు చేసిన సమాచారం మద్రాసు హైకోర్టుకు చేరింది. ఓ పిటిషనర్‌ దాఖలు చేసిన వాజ్యంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌ స్పందించింది. ఈ పుస్తకాలను సీజ్‌ చేసే విధంగా, విడుదలను అడ్డుకునేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి.

దాడి కేసులో కార్మికుడి అరెస్ట్‌

తిరువొత్తియూరు: మద్యం మత్తులో ఇంటికొచ్చిన స్నేహితుడిపై కత్తితో దాడి చేసిన కార్మికుడిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె కోడంబాక్కం సమీపంలోని పులియూర్‌ హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీకి చెందిన కింగ్‌స్టన్‌. మంగళవారం రాత్రి ఇతను మద్యం మత్తులో అదే ప్రాంతంలోని శివాలయం వీధిలో ఉంటున్న స్నేహితుడు, కార్మికుడైన శివశంకర్‌ ఇంటికి వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న కింగ్‌స్టన్‌న్‌ను శివశంకర్‌ మందలించాడు. దీంతో స్నేహితుల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన శివశంకర్‌ కత్తితో కింగ్‌స్టన్‌ను విచక్షణారహితంగా నరికాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన కింగ్‌స్టన్‌ కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. వడపళని పోలీసులు శివశంకర్‌ను అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నారు.

ఫిర్యాదులు స్వీకరించిన పోలీస్‌ కమిషనర్‌ అరుణ్‌

కొరుక్కుపేట: చైన్నెలోని వేపేరిలోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో కొనసాగుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార శిబిరంలో భాగంగా, ప్రతి బుధవారం పోలీస్‌ కమిషనర్‌ అరుణ్‌ స్వయంగా 22 మంది నుంచి పిటిషన్లను స్వీకరించారు. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులను తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

బస్టాండ్‌ పనుల పరిశీలన

కొరుక్కుపేట: చైన్నె మహానగరాభివృద్ధి సంస్థ తరఫున భారీ ఎత్తున నిర్మిస్తున్న చెంగల్పట్టు కొత్త బస్టాండ్‌ నిర్మాణ పనులను మంత్రి పి.కె. శేఖర్‌బాబు స్వయంగా పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి ప్రజల వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు కాంట్రాక్టర్లకు సూచనలు చేశారు. తనిఖీల్లో చెంగల్పట్టు ఎమ్మెల్యే వరలక్ష్మి, గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి కాకర్ల ఉష, చైన్నె మహానగరాభివృద్ధి సంస్థ కార్యదర్శి ప్రకాష్‌, ముఖ్య కార్యనిర్వహణాధికారి శివజ్ఞానం, చెంగల్పట్టు కలెక్టర్‌ స్నేహ, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement