‘పుట్టింది పేదరికం.. ప్రభుత్వ బడులలో చదువులు.. ప్రభుత్వం అందించిన సాయం, ప్రోత్సాహంతో జాతీయ, ప్రపంచ స్థాయి విద్యా సంస్థలలో చదువుకుంటున్న విద్యార్థులు ఒకొక్కరికి ఒక్కోగాథ. కొందరు విద్యార్థుల ప్రయాణం ఆనంద భాష్పాలకు దారి తీస్తే, మరికొందరు ప్రస్థానం కన్నీళ్లు పెట్టించాయి. అయినా, తాము సాధించామన్న విజయపు దరహాసంతో విద్యలో తమిళనాడే బెస్ట్ అని చాటే విధంగా ఉద్వేగ పూరితంగా ముందడుగు వేశారు. ఇందుకు అచ్చమైన వేదికగా విద్యలో బెస్ట్ తమిళనాడు వేడుక గురువారం నిలిచింది.
సాక్షి, చైన్నె: తమిళనాడులోని విద్యార్థులు, యువతకు విద్య, క్రీడలలో రాణించే రీతిలో ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అల్పాహార పథకం, ఉన్నత విద్యా పరంగా ప్రోత్సాహంగా తమిళ్ పుదల్వన్, పుదుమై పెన్, ప్రభుత్వ బడులలోని విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్థలలో చదివేందుకు వీలుగా, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధంగా శిక్షణలు, నైపుణ్యాల శిక్షణ అంటూ నాన్ మొదల్వన్ వంటి పథకాలు ఎందరో జీవితాలలో వెలుగు నింపుతున్నది.
ఇక, క్రీడా పరంగా తమిళనాడు జాతీయ, అంతర్జాతీయంగా క్రీడాకారులు దూసుకెళ్తున్నారు. ఈ పథకాలన్నీ ఒకే వేదికగా తెచ్చే రీతిలో, మరింత విస్తరణ దిశగా గురువారం రాత్రి నెహ్రు ఇండోర్ స్టేడియంలో జరిగింది. ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, విద్యా మంత్రులు కోవి చెలియన్, అన్బిల్ మహేశ్, సాంఘిక సంక్షేమ శాఖమంత్రి గీతా జీవన్‌తో పాటూ ఇతర మంత్రులు, కనిమొళితో పాటూ ఎంపీలు, సీఎస్ మురుగానందంతో పాటూ అధికారులు, ఎండీఎంకే నేత వైగో పాటూ డీఎంకే మిత్ర పక్ష నాయకులు, సినీ నటుడు శివకార్తికేయన్, దర్శకులు మారి సెల్వరాజ్, మిస్కిన్‌తో పాటూ పలువురు, క్రికెటర్ నటరాజ్ తదితరులు హాజరయ్యారు.
ఉద్వేగంతో..
క్రీడల పరంగా రాణిస్తున్న వారు, తాము ప్రభుత్వ బడులలో చదువుకుంటున్న సమయంలో పడ్డ కష్టాలు, కుటుంబ ఆర్థిక స్థోమత, చదువులతో పాటూ క్రీడలలో రాణించేందుకు ప్రభుత్వం అందించిన సహకారాన్ని వివరించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పొందిన తమకు ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం గురించి వివరిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. పుదుమై పెన్ పథకం ద్వారా ఉన్నత విద్యను చదువుకుంటున్న పలువురు విద్యార్థినులు తమ కష్టాలను గుర్తు చేస్తూ కన్నీటి పర్యంతం కావడమే కాకుండా, అందర్నీ ఉద్వేగానికి గురి చేశారు. ఇదే విధంగా ఒకొక్కరిది..ఒక్కో గాథ అన్నట్టుగా ఉద్వేగ భరతంగా వేడుక సాగింది. విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్, సాంఘిక సంక్షేమ మంత్రి గీతాజీవన్‌తో పాటూ డిప్యూటీ సీఎం ఉదయనిధి , శివ కార్తికేయన్‌ల కళ్లు చెమ్మరిల్లాయి. ప్రభుత్వ శిక్షణతో ఐఐటీ, తదితర జాతీయ స్థాయి విద్యా సంస్థలే కాదు, పలు దేశాలలో చదువుకుంటున్న విద్యార్థులు, ఇంజినీర్లు, డాక్టర్లు, పరిశోధకులు, వివిధ అత్యున్నత రంగాలలో చివరి సంవత్సరం చదువుకుంటున్న విద్యార్థులు తాము పడ్డ శ్రమ, ప్రభుత్వం అందిస్తున్న విద్యా ప్రోత్సాహాన్ని గుర్తు చేస్తూ ఆనంద భాష్పాలు వ్యక్తం చేశారు. నటుడు శివకార్తికేయన్ తన ప్రసంగంలో ఒకొక్కరి గాథను వింటుంటే తనకు స్ఫూర్తి, తనలోనూ ఓ నమ్మకం అన్నది కలుగుతోందన్నారు. జీవితంలో గెలవాలంటే చదువు ముఖ్యం అని, తాను ప్రస్తుతం సినిమాలలో ఉన్నా, ఈ ఇండ్రస్టీ బయటకు పంపిస్తే తన వద్ద ఉద్యోగం చేసుకునేందుకు రెండు డిగ్రీలు ఉన్నాయని ఉద్వేగంతో వ్యాఖ్యలు చేశారు. దర్శకులు మిస్కిన్, మారి సెల్వరాజ్, వెట్రి మారన్‌ల ప్రసంగాలు సైతం సందేశ పూరితంగా సాగాయి.
పథకాల విస్తరణ– అవార్డులు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా పథకాలను విస్తరిస్తూ ఈ వేడుకలో చర్యలు తీసుకున్నారు. ఈసందర్భంగా విద్యా రంగానికి విశిష్ట సేవలు, సహకారం అందిస్తున్న సంస్థలు,సంఘాలు, ముఖ్యులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్‌లు అవార్డులతో సత్కరించారు. ఈసందర్భంగా అగరం ఫౌండేషన్ తరపున నటుడు శివకుమార్, దర్శకుడు జ్ఞానవేల్‌లను సత్కరిస్తూ అవార్డును అందజేశారు.
శ్రమకు తగ్గ ఫలితం: సీఎం
నాలుగేళ్లు పడ్డ శ్రమకు ఫలితం కంటి ముందు కనిపిస్తున్నదని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఇందుకు కారణం ఇక్కడ ఒక్కో విద్యార్థి చెప్పుకున్న గాథేనని గుర్తు చేశారు. ఈ వేడుక కేవలం తమను తాము పొగడ్తలతో ముంచెత్తుకునేందుకు మాత్రం కాదని, ఒక్కో విద్యార్థి పడ్డ శ్రమ, లభించిన ప్రోత్సాహం రానున్న కాలానికి మరో విద్యార్ధికి మార్గదర్శకం కావాలన్నదే లక్ష్యం అని వివరించారు. ఇక్కడి పథకాలను పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని గుర్తుచేస్తూ, తెలంగాణలో అమలు చేస్తున్న మంచి పథకాలను ఇక్కడ అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఇదే ఆరోగ్యకరమైన అభివృద్ధి రాజకీయం అని వ్యాఖ్యానించారు.
ఇక్కడ విద్యార్థులను చూస్తుంటే ఆనందం కలుగతోందని, ఒక విద్యార్థి చదువుకుని పైకి వస్తే ఒక కుటుంబం ఉన్నతం అవుతుందని, ఒక రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని, దేశానికి పక్కబలంగా రాష్ట్రం మారుతుందన్నారు. నెలకు వెయ్యి ఇచ్చినంత మాత్రాన మార్పు వచ్చేస్తుందా? అని ప్రశ్నించే వాళ్లకు ఇక్కడ విద్యార్థుల విజయ గాథే సమాధానం అన్నారు. యూజీ పూర్తిచేసిన వారు పీజీ చదవండి, అంతకన్నా ఎక్కువ చదవండి అండగా తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. ప్రపంచం చాలా పెద్దది అని, విజయాలు అన్నీ వైపులా ఉండాలని, ప్రతి విద్యార్థి చదువుకు తాను అండ అని పేర్కొంటూ, విద్యలో ఉన్నతంగా తమిళనాడును మార్చేద్దామని ధీమా వ్యక్తం చేశారు.