తమిళనాడు ప్రయోజనాలే నా ఊపిరి | - | Sakshi
Sakshi News home page

తమిళనాడు ప్రయోజనాలే నా ఊపిరి

Mar 2 2026 7:47 AM | Updated on Mar 2 2026 7:47 AM

తమిళన

తమిళనాడు ప్రయోజనాలే నా ఊపిరి

● జన్మదినం వేళ సీఎం స్టాలిన్‌ సందేశం ● వాడవాడలా డీఎంకే వర్గాల సంబరాలు ● పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు

‘ప్రజల సేవకే నా జీవితం అంకితం..తమిళం, తమిళనాడు ప్రయోజనాలే నా ఊపిరి , వారి రక్షణే ప్రథమ కర్తవ్యం’ అని తన జన్మదినం వేళ సీఎం ఎంకే స్టాలిన్‌ ఓ సందేశం ద్వారా స్పష్టం చేశారు. తమ నేత 73వ వసంతంలోకి అడుగు పెట్టడంతో ఆదివారం డీఎంకే వర్గాలు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సేవల్లో నిమగ్నమయ్యారు.

కరుణానిధి సమాధి వద్ద సీఎం స్టాలిన్‌ తదితర నేతల నివాళులు

సాక్షి, చైన్నె : డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ద్రావిడ మోడల్‌ సీఎంగా మరో నెలన్నర రోజులలో ఐదేళ్లు పూర్తి చేసుకోనున్నారు. ద్రావిడ మోడల్‌ 2.ఓ ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగా 2026 అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టిన స్టాలిన్‌ ఆదివారం 73వ వసంతంలోకి అడుగు పెట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే వర్గాలు వాడవాడలా పండుగ తరహాలో వేడుకలు జరుపుకున్నాయి. ఎటు చూసినా డీఎంకే జెండాలను, తోరణాలను హోరెత్తించారు. స్టాలిన్‌ పేరిట స్థానిక నేతలు కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచి పెట్టారు. సంక్షేమ పథకాల పంపిణీ అన్నదానం, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. తమ నేతకు అభిమాన నీరాజనాలు పలికే విధంగా సంబరాలతో, ఫ్లెక్సీలతో శుభాకాంక్షలు హోరెత్తించారు.

నేతల సమాధుల వద్ద నివాళులు..

ఉదయాన్నే మెరీనా తీరంలోని ద్రావిడ పార్టీల ఆవిర్భావ కర్త అన్నాదురై, తన తండ్రి, పార్టీ దివంగత నేత కరుణానిధి సమాధుల వద్ద స్టాలిన్‌ పుష్పాంజలి ఘటించారు. ఇక్కడి పారిశుధ్య కార్మికులకు సహాయకాలను అందజేశారు. అనంతరం వేప్పేరిలోని పెరియార్‌ తిడల్‌కు చేరుకుని ద్రవిడ సిద్ధాంత కర్తకు నివాళులర్పించారు. తర్వాత గోపాలపురం, సిఐటీ నగర్‌ ఇంటికి చేరుకున్న స్టాలిన్‌ కరుణానిధి చిత్ర పటానికి అంజలి ఘటించారు. ముందుగా తన నివాసంలో సతీమణి దుర్గా స్టాలిన్‌, తనయుడు ఉదయ నిధి స్టాలిన్‌తో పాటుగా మనవళ్లు, మనవరాళ్లు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి స్టాలిన్‌ కేక్‌ కట్‌ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.

సంబరాలు.. శుభాకాంక్షల వెల్లువ

తేనాంపేటలోని డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయంకు చేరుకున్న స్టాలిన్‌కు పార్టీ వర్గాలు బ్రహ్మారథం పట్టాయి. పార్టీ ముఖ్య నేతలు, కేడర్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ నేతలు, మంత్రులు దురై మురుగన్‌, నెహ్రూ, ఏవి వేలు, పొ న్ముడి, శేఖర్‌బాబు, ఎం. సుబ్రమణియన్‌, ఎంఆర్‌కే పన్నీరు సెల్వం, టీఆర్‌బీ రాజ, అన్బిల్‌ మహేశ్‌, ఎంపీ టీఆర్‌ బాలు, రాజ,దయానిధి మారన్‌, యువజన నేత, ఉప ముఖ్య మంత్రి, తనయుడు ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి కేక్‌ కట్‌ చేశారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన కేడర్‌ అరివాలయం వద్ద బారులు తీరి మరీ స్టాలిన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. కొందరు అయితే, పుస్తకాలు, మొక్కలు తదితర వాటిని కానుకగా సమర్పించారు. మరి కొందరు వినూత్న కానుకలను అందజేశారు. ఇక డీఎంకే ఐటీ విభాగం వర్గాలు సామాజిక మాధ్యమాల ద్వారా రికార్డు సృష్టించే రీతిలో శుభాకాంక్షల వెల్లువ దిశగా ముందుకు సాగాయి. సీఎం స్టాలిన్‌, పేరిట హ్యాస్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేసి శుభాకాంక్షలను హోరెత్తించాయి. పార్టీ వర్గాల నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలే కాదు, ఆదివారం జన్మించిన బిడ్డలకు బంగారు ఉంగరాలను అందజేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై, ఎండీఎంకే నేత వైగో, ఎంపి దురై వైగో, వీసీకే నేత తిరుమావళవన్‌, సీపీఎం నేతలు షణ్ముగం, బాలకృష్ణన్‌, సీపీఐ నేత వీర పాండియన్‌, ముత్తరసన్‌, ఇండియన్‌ యూనియన్‌ ముస్లీం లీగ్‌నేత ఖాదర్‌మోహిద్దీన్‌, మనిదనేయమక్కల్‌ కట్చి నేత జవహిరుల్లా, తమిళర్‌ వాల్వురిమై కట్చి నేత వేల్‌ మురుగన్‌, కొంగునాడు దేశీయ కట్చి నేత ఈశ్వరన్‌, సినీ నటుడు, మాజీ సీఎం పన్నీరు సెల్వం,తదితర ఆయా పార్టీల నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సీఎం స్టాలిన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం స్టాలిన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, ప్రధాని మోదీ, ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ, తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, సినీ నటుడు రజనీకాంత్‌ శుభాకాంక్షల సందేశాలను పంపించారు.

ప్రతిజ్ఞ..

తమిళ జాతి ఎవరి ముందూ తలవంచకూడదని, లక్ష్య సాధనలో వెనకడుగు వేయకూడదని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఒక ముఖ్యమైన ప్రతిజ్ఞ చేశారు మనపై జరుగుతున్న కుట్రలను మన మేధస్సుతో, ఐక్యతతో తిప్పికొట్టాలి. దీని కోసం నన్ను నేను సంపూర్ణంగా అంకితం చేసుకుంటాను. ఇదే నా పుట్టినరోజు ప్రతిజ్ఞ అని ప్రకటించారు. పెరియార్‌, అరిజ్ఞర్‌ అన్నా, ముత్తమిలరిజ్ఞర్‌ కలైజ్ఞర్‌ కరుణానిధి చూపిన మార్గంలో పయనిస్తూ.. తమిళనాడు పోరాడుతుంది – తమిళనాడు గెలుస్తుంది అనే నినాదంతో అందరం కలిసి విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు.

ప్రథమ కర్తవ్యం..

73వ పుట్టినరోజు సందర్భంగా సీఎం ఎం.కే. స్టాలిన్‌ సామాజిక మాధ్యమంలో భావోద్వేగ సందేశం విడుదల చేశారు. ప్రజలను ఉద్దేశించి ఆయన పేర్కొంటూ, తమిళం, తమిళనాడు ప్రయోజనాలే తన ఊపిరి అని, వాటి రక్షణే తన ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. చిన్నప్పటి నుండి 73వ ఏట అడుగుపెట్టే వరకు, కష్టపడి పనిచేయడం తప్ప తనకు మరేదీ తెలియదన్నారు. దేశానికి, ప్రజలకు సేవ చేయడమే జీవితకాల బాధ్యతగా భావించి ముందుకు సాగుతున్నాను అని పేర్కొన్నారు. తమిళనాడు గర్వించదగ్గ చరిత్రలో తాను ఒక చిన్న సేవకుడిని అయినప్పటికీ, లభించిన ప్రతి అవకాశాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం గొప్పగా వినియోగించుకుంటున్నానని వివరించారు. తమిళనాడును దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలనే లక్ష్యంతో ద్రవిడ మోడల్‌శ్రీ పాలనను అందిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ పాలన ఫలితంగానే నేడు భారతదేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తమిళనాడును ప్రపంచం గుర్తించేలా తీర్చిదిద్దామని, ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి, ప్రతి హృదయానికి చేరుకున్నాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

తమిళనాడు ప్రయోజనాలే నా ఊపిరి1
1/1

తమిళనాడు ప్రయోజనాలే నా ఊపిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement