ఆల్ ది బెస్ట్..!
సాక్షి, చైన్నె : ప్లస్–2, పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సమయం ఆసన్నమైంది. సోమవారం(మార్చి 2వ తేదీ) నుంచి 26వ తేదీ వరకు ప్లస్–2, మార్చి 3 నుంచి 27వ తేదీ వరకు ప్లస్–1 పరీక్షలు, మార్చి 11 నుంచి ఏప్రిల్ 6వతేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ప్లస్–2 ప్రాక్టికల్ ఫిబ్రవరి 9 నుంచి 14వ తేదీ వరకు, ప్లస్ –1 ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 16 నుంచి 21వ తేదీ వరకు, పదో తరగతి ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 23 నుంచి 28 తేది వరకు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఇక పబ్లిక్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పాఠశాల విద్యా శాఖ చేసింది. ఆయా ప్రాంతాల వారీగా విభజించి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అప్పటికే విద్యార్థులకు హాల్ టికెట్లు అందజేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. విద్యార్థుల కోసం పరీక్ష కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేశారు. లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యారు. ఇక, పరీక్షలు ముగియగానే మే 8వ తేదీన ప్లస్–2, 10వ తేదీన ప్లస్ –1, 20వ తేదీన పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తామని ముందుగానే విద్యా శాఖ ప్రకటించింది.
సీఎం శుభాకాంక్షలు..
పదో తరగతి, ప్లస్–2 పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు తెలియజేశారు. బోర్డు పరీక్షల నేపథ్యంలో, విద్యార్థులందరూ ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని ఆకాంక్షించారు. మార్చి 2 నుండి ప్లస్–2 పరీక్షలను 7,99,692 మంది, మార్చి 11 నుంచి పదో తరగతి పరీక్షలను 8,82,806 మంది రాయనున్నారని వివరించారు. నమ్మకమే మంత్రం అన్నట్టుగా నా వల్ల అవుతుంది అనే మంత్రాన్ని మనసులో ఉంచుకోవాలని, స్పష్టమైన అవగాహన, ధైర్యం ఉంటే పరీక్షల పై భయం అవసరం లేదన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోవాలని, తగినంత నిద్రపోవాలని, ప్రశాంతంగా ఉండాలని ఆయన కోరారు. ఒత్తిడికి లోనుకాకుండా సంతోషంగా పరీక్షలను ఎదుర్కోవాలని సూచించారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం తమిళనాడు ప్రభుత్వం ‘పుదుమై పెన్’, ‘తమిళ్ పుదల్వన్’, ‘నాన్ ముదల్వన్’ వంటి అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్నదనని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులు ఎదుగుదలే తమిళనాడు అభివృద్ధి అని, కష్టపడి చదివిన ప్రతి విద్యార్థికి కచ్చితంగా ప్రతిఫలం లభిస్తుందన్నారు. పట్టుదల, కఠిన శ్రమ విజయానికి మెట్లు కావాలి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరూ అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు.
ప్లస్–2 షెడ్యూల్ ఇలా..
మార్చి 2న ల్యాంగ్వేజ్, 5న ఆంగ్లం, 09న కెమిస్ట్రీ, అకౌంటెన్సీ, జాగ్రఫీ, 13వ తేదీన ఫిజిక్స్, ఎకనామిక్స్ ఉద్యోగ నైపుణ్యం, 17వ తేదీన మ్యాథమెటిక్స్, జువాలజీ, కామర్స్, మైక్రో బయాలజీ, న్యూట్రీషన్, టెక్స్‌టైల్స్,ఫుడ్‌సర్వీసు మేనేజ్‌మెంట్, అగ్రి సైన్స్, నర్సింగ్ జనరల్ సబ్జెక్టులు,23వ తేదీన తేదీన బయోలజీ, బొటనీ, హిస్టరీ, బిజినెస్ మాథ్యమెటిక్స్, స్టాటిస్టిక్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, బేసిక్ సివిల్ ఇంజనీరింగ్, , బేసిక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బేసిక్ మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులు, 26వ తేదీన కమ్యునికేటివ్ ఇంగ్లీషు, ఎతిక్స్ అండ్ ఇండియన్ కల్చర్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్, బయోకెమిస్ట్రీ, అడ్వాన్స్‌డ్ ల్యాంగ్వేజ్(తమిళం), హోంసైన్స్, పొలిటికల్ సైన్స్, స్టాటిస్టిక్ కోర్సులకు పరీక్షలు జరగనున్నాయి.
పదో తరగతి..
మార్చి11వ తేదీన లాంగ్వేజ్ (తమిళం),మార్చి 16 వ తేదీ ఆంగ్లం, మార్చి 25వ తేదీ మ్యాథమెటిక్స్, 30వ తేదీ సైన్స్, ఏప్రిల్ 2న సోషియల్ సైన్స్, ఏప్రిల్ 6వ తేదీన ఆప్షనల్ లాంగ్వేజ్ సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయి.


