వార్ టెన్షన్
పశ్చిమాసియా దేశాల్లో 16 లక్షల మంది తమిళులు
అత్యవసర సేవలకు టోల్ ఫ్రీ
చైన్నె నుంచి 33 విమానాల సేవల రద్దు
అమెరికా దౌత్య కార్యాలయం ముట్టడి
సాక్షి, చైన్నె: మిత్ర దేశం ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై అమెరికా దాడులు తమిళనాట టెన్షన్ రేపాయి. ప్రస్తుతం పశ్చిమాసియా దేశాలలో ఉన్న 16 లక్షల మంది తమిళుల క్షేమ సమాచారం కోసం కుటుంబీకులు, ఆప్తులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం తక్షణం ఢిల్లీలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి, టోల్ ఫ్రీ నెంబర్లను ప్రకటించింది. వివరాలు.. ఇరాన్‌ను టార్గెట్ చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు, పశ్చిమాసియాలోని బహ్రెయిన్, కువైట్, ఖత్తార్, సౌదీ వంటి దేశాలలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ విరుచుకు పడటం వంటి సమాచారాలతో తమిళనాట ఉన్న వారిలో కలవరం బయలు దేరింది. అదే సమయంలో ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ హతం కావడం వంటి సమాచారాలతో యుద్దం టెన్షన్ ఉత్కంఠను రేపుతోంది.
హెల్ప్‌లైన్ ఏర్పాటు..
ఖత్తార్, బహ్రెయిన్, దుబాయ్, కువైట్, సౌదీ వంటి దేశాలలోని తమిళుల కోసం హెల్ప్‌లైన్‌ను డీఎంకే ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. తమిళనాడు ప్రభుత్వ ప్రతినిధి విజయ్ పర్యవేక్షణలో ఢిల్లీలో తమిళుల కోసం సర్వం సిద్ధంచేశారు. ప్రస్తుతం విమాన సేవలు లేని దృష్ట్యా, యుద్ధం తీవ్రమైన పక్షంలో స్వదేశానికి తిరుగు ప్రయాణం అయ్యేందుకు సిద్ధంగా ఉన్న వాళ్లు తమను సంప్రదించ వచ్చని సూచించారు. ఈ మేరకు ఢిల్లీ కంట్రోల్ రూం నెంబర్ –011–2419 3300,92895 16712, నాన్ రెసిడెంట్ తమిళ్స్ వెల్పేర్ విభాగం హెల్ప్ లైన్ నెంబర్లు: 1800 309 3793, 9180 6900 9900,9180 6900 9901లను సంప్రదించవచ్చునని సూచించారు. పశ్చిమాసియా దేశాలలోని తమిళులు భారత రాయబార కార్యాలయం ఇచ్చే సూచనలు, నిబంధనలకు అనుగుణంగా సురక్షితంగా ఉండాలని పిలుపు సీఎం స్టాలిన్‌పిలుపు నిచ్చారు. వీరందరీ భద్రతను ధృవీకరించాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిపళణి స్వామి డిమాండ్ చేశారు. కాగా, చైన్నె నుంచి ఓమన్, దుబాయ్, ఖతార్, కువైట్ తదితర దేశాలకు వెళ్లే 33 విమానాల సేవలు రద్దు చేశారు. కోయంబత్తూరు, మదురై, తిరుచ్చి నుంచి వెళ్లేకొన్ని విమాన సేవలు రద్దు అయ్యాయి. కార్ రేసింగ్ నిమిత్తం దుబాయ్ వెళ్లిన సినీ నటుడు అజిత్ సురక్షితంగా ఉన్నట్టు ఆయన సన్నిహితులు ప్రకటించారు.
నిరసనలు :ఇరాన్‌పై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా చైన్నెలో మైనారిటీ సంఘాలు, పార్టీలు భారీ నిరసనకు దిగాయి. అమెరికా దౌత్య కార్యాలయాన్ని ముట్టడించాయి. చైన్నెలోని షియా సామాజిక వర్గానికి చెందిన ముస్లింనేతల పిలుపుతో పలు పార్టీలు స్పందించాయి. మనిదనేయ జన నాయగ కట్చి నేత తమీమున్ అన్సారీ, ముక్కళత్తోర్ పేరవై నేత కరుణానిధి, కొంగు ఇలంజర్ పేరవై నేత తనియరసులతో పాటూ మైనారిటీ నేతలు పెద్ద సంఖ్యలో థౌజండ్ లైట్స్ నుంచి ర్యాలీగా జెమినీ వంతెన వద్ద ఉన్న అమెరికా దౌత్యకార్యాలయం వద్దకు దూసుకొచ్చారు. పోలీసులు నిరసన కారులను ఆపేశారు. అయినా వారు ఏ మాత్రం తగ్గకుండా ముందడుగు వేశారు. యుద్ధం ఆపాల్సిందేనంటూ పెద్దఎత్తున నినదించారు.


