జనసంద్రం..! | Sakshi
Sakshi News home page

జనసంద్రం..!

Published Sun, Nov 19 2023 1:48 AM

తిరుచెందూరు సాగరతీరంలో అశేష జనవాహిని  - Sakshi

సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు శనివారం హరో..హర నామస్మరణతో పులకించాయి. ఇక ఆరు పడై వీడుల్లో రెండోదిగా ప్రసిద్ధి చెందిన తిరుచెందూరులో సూర సంహారం సాయంత్రం హరోం హర నామస్మరణ మధ్య వేడుకగా సాగింది. సముద్ర తీరం ఒడ్డున ఈ మహత్తర ఘట్టాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందినది. ఇక్కడ జయంతి నాదర్‌గా కొలువైన స్వామివారికి ఏటా స్కంధ షష్టిని అత్యంత వేడుకగా జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో ఆరో రోజు జరిగే సూర సంహారాన్ని తిలకించేందుకు దేశవిదేశాల నుంచి సైతం భక్తులు తరలి రావడం బట్టి చూస్తే, ఇక్కడ వేడుకలకు భక్తులు ఏ మేరకు ప్రాధాన్యతను ఇస్తారో స్పష్టం అవుతోంది. సముద్ర తీరం ఒడ్డున కొలువు దీరిన ఈ ఆలయానికి నిత్యం భక్తజనం పోటెత్తుతూనే ఉంటారు. ఇక్కడ స్కంధ షష్టి ఉత్సవాలు ఈనెల 13వ తేదిన ప్రారంభమయ్యాయి. ఆ రోజున అనేక మంది భక్తులు వత్రాన్ని స్వీకరించి, ఆరు రోజుల పాటు ఆలయ పరిసరాల్లో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. ఆలయంలో రోజూ విశిష్ట పూజలు, అభిషేకాలు సాగాయి. సర్వాలంకరణతో జయంతి నాథర్‌ స్వామి వారు వళ్లి, దేవయాని సమేతంగా భక్తులకు దర్శనం ఇస్తూ వచ్చారు. స్కంధ షష్ఠి ఉత్సవాల్లో ఆరో రోజు అత్యంత ముఖ్య ఘట్టం ఇక్కడ కోలాహలంగా జరిగింది.

కనులపండువగా...

ఆరవ రోజు సాయంత్రం జరిగిన సూర సంహారాన్ని తిలకించేందుకు లక్షల్లో భక్తులు తరలి వచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తూత్తుకుడి జిల్లా యంత్రాంగం పకడ్భందీ ఏర్పాట్లు చేసింది. సముద్ర తీరం ఒడ్డున భక్తులు కూర్చుని అద్వితీయ ఘటాన్ని తిలకించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సముద్రంలోకి ఎవ్వరూ చొచ్చుకు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పడవలు, బోట్ల నుంచి భద్రతను పర్యవేక్షించారు. శనివారం వేకువజామున ఒంటి గంటకు ఆలయంలో పూజాది కార్యక్రమాలు మొదలయ్యాయి. అభిషేయాలు, యాగాది పూజలతో స్వామి వారి విశ్వరూప దర్శనాన్ని భక్తులకు కల్పించారు. ఆలయ ప్రధాన అర్చకుల నేతృత్వంలో సంతోష మండపంలోని స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం సూర సంహార ఘట్టం కనుల పండువగా సాగింది. భక్త జనం హరోం..హర అన్న నామ స్మరణను మిన్నంటేలా నినాదించడంతో పట్టు వస్త్రాలు ధరించి, వేలాయుధాన్ని చేతబట్టి స్వామి వారు ముందుకు సాగారు.

తిరుచెందూరులో వేడుకగా సూరసంహారం

సముద్ర తీరంలో అద్వితీయ ఘట్టం

పోటెత్తిన భక్తజనం

తిరుచెందూరు సముద్రంలోకి కలిసిందా.. అన్నట్టుగా ఆ పరిసరాలు లక్షలాది మంది భక్తులతో నిండిపోయాయి. ఇసుక వేస్తే రాలనంతంగా 5 లక్షల మందికి పైగా భక్తులు తరలి వచ్చి సూర సంహార ఘటాన్ని తిలకించారు. భక్త జన సమూహం మధ్యలోకి స్వామి వారు రాగానే, శూరుడు తన వీరంగాన్ని ప్రదర్శించడం మొదలెట్టాడు. వివిధ వేషాధారణలతో అసురుడు స్వామి వారి సహనాన్ని పరీక్షించే రీతిలో వీరంగాలు చేస్తూ ముందుకు సాగాడు. ఓపికగా వాటిని పరిశీంచిన స్వామి వారు చివరకు తన వేలాయుధంతో సంహరించారు. ఈ ఘట్టాన్ని చూసిన భక్తులు జయ జయధ్వానాలతో, హరోంహర నినాదాలను మారుమోగించారు. సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు జరిగిన ఈ ఘట్టం ముగియగానే, భక్తులు సముద్రస్నానానికి తరలి వెళ్లారు. సముద్రంలో స్నానం ఆచరించిన భక్తులు, తదుపరి అక్కడి నాలుగు బావి నీటిని నెత్తిన చల్లుకుని ఆలయంలో స్వామి వారి దర్శనానికి బారులు తీరారు. సముద్రం ఒడ్డున ఉన్న ఈ నాలుగు బావి నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి. మిగిలిన చోట్ల నీటిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ వేడుక తిలకించేందుకు తమిళనాడు నుంచే కాకుండా, కేరళతో పాటు మలేషియా, సింగపూర్‌, వంటి దేశాల నుంచి సైతం తమిళ భక్తులు తరలి రావడం విశేషం. సూర సంహారం తదుపరి స్వామి వారికి అద్దాల భవనంలో విశేష అభిషేకాలు, పూజలు జరిగాయి. అలాగే దిండుగల్‌ జిల్లా పళణిలోని దండాయుధపాణి, మదురై తిరుప్పరగుండ్రం సుబ్రమణ్యస్వామి, తంజావూరు జిల్లా స్వామి మలైలోని స్వామినాథ స్వామి ఆలయం, మదురై పళముదిర్‌ చోళై, సోలై మలై మురుగన్‌, తిరుప్పర గుండ్రంలోని మురుగన్‌ ఆలయాల్లో స్కంధ సష్టి ఉత్సవాలలో భాగంగా సూర సంహార వేడుకలు కనుల పండువగా నిర్వహించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement