
కార్పొరేషన్ మేయర్ ప్రియ విదేశీ పర్యటన
సాక్షి, చైన్నె: చైన్నె కార్పొరేషన్ మేయర్ ప్రియ విదేశీ పర్యటనకు వెళ్లారు. వారం రోజులు ఆమె స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీలలో అధికారిక పర్యటన చేయనున్నారు. గత ఏడాది జరిగిన నగర పాలక సంస్థల ఎన్నికల ద్వారా చైన్నె రాజకీయ తెరపైకి ప్రియ వచ్చిన విషయం తెలిసిందే. కార్పొరేటర్‌గా తొలిసారి డీఎంకే తరఫు ఎన్నికలతో మేయర్ పదవికి అర్హత సాధించారు.
అతిపిన్న వయస్సులో చైన్నె మేయర్ పగ్గాలు చేపట్టి నగరాభివృద్ధిలో దూసుకెళ్తున్నారు. ప్రజల వద్దకే మేయర్ అంటూ నేరుగా ఆయా ప్రాంతాలకు వెళ్లి మరీ విజ్ఞప్తులను స్వీకరించి పరిష్కరిస్తున్నారు. ఈ పరిస్థితులలో పర్యావరణ పరిరక్షణ, వేస్ట్ మేనేజ్ మెంట్ అంశాలపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఆమెను విదేశీ పర్యటనకు ఎంపికచేయడం విశేషం.
శనివారం రాత్రి చైన్నె నుంచి డెప్యూటీ మేయర్ మహేశ్వరర్, పలువురు అధికారులతో కలిసి ఆమె విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈనెల 24వ తేదీ చైన్నెకు తిరుగు పయనం కానున్నారు. ఆయా దేశాల్లో అమల్లో ఉన్న పథకాలను చైన్నెలో అమలు చేయడానికే ఈ పర్యటన అని అధికారులు పేర్కొన్నారు.