మరమ్మతులు చేయిస్తాం
సూర్యాపేటటౌన్ : పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని, చిన్నారులకు ఆటవిడుపును అందించాల్సిన పార్కులు.. ప్రస్తుతం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా దర్శనమిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రశాంత వాతావరణంలో సేదతీరేందుకు, వ్యాయామం చేసుకునేందుకు వెళ్లే పట్టణ ప్రజలు సౌకర్యాలు లేక అసౌకర్యానికి గురవుతున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 15 పార్కులు ఉన్నప్పటికీ, వాటి నిర్వహణపై మున్సిపల్ అధికారులు తగిన శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని పార్కుల్లో పిల్లల ఆట వస్తువులు శిథిలావస్థకు చేరుకోగా, మరికొన్ని చోట్ల నిర్వహణ లోపించి అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దాంతో పార్కులకు వెళ్లేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు.
విరిగిన ఆట వస్తువులు
పార్కులకు వచ్చే చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన జారుడు బల్ల, ఉయ్యాల, ఇతర ఆట వస్తువులు నిర్వహణ లేక విరిగిపోయి శిథిలావస్థకు చేరుతున్నాయి. కొన్ని చోట్ల వాటి రంగులు వెలిసిపోగా, మరికొన్ని చోట్ల పరికరాలు విరిగిపోయి పనికిరాకుండా పోతున్నాయి. మరమ్మతులు చేపట్టకపోవడంతో చిన్నారులు ఆడుకునే సమయంలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్కుల్లో పిల్లలకు సురక్షితమైన ఆటవస్తువులు అందుబాటులో ఉంచాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
మున్సిపాలిటీలో 15 పార్కులు
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 15 పార్కులు ఉన్నాయి. వీటిలో తాళ్లగడ్డలోని ముత్యాలమ్మ గుడి పార్కు, 43వ వార్డులోని నం–2 స్కూల్ పార్కు, ఇందిరా పార్కు, కృష్ణకాలనీ పార్కు, అంజనాపురి కాలనీ పార్కు, ఇందిరమ్మ కాలనీ ఫేస్ –1 పార్కు, ఇందిరమ్మ కాలనీ ఫేస్–2 పార్కు, ఇందిరమ్మ కాలనీ ఫేస్ –3 పార్కు, ఎన్‌టీఆర్ కాలనీ పా ర్కు, అంబేద్కర్ పార్కు, సైనిక్‌పురి కాలనీ పార్కు, అంబేద్కర్‌నగర్ పార్కు, ఎన్‌టీఆర్ పార్కు, హౌసింగ్ బోర్డు పార్కు. వీటిలో నాలుగు పార్కులు మా త్రమే ప్రజలకు కొంత మేర ఆహ్లాదాన్ని అందిస్తు న్నాయి. సగానికి పైగా పార్కులు తీవ్ర అసౌకర్యాల మధ్య అస్తవ్యస్థంగా ఉన్నాయి.
పర్యవేక్షణ కరువు
పార్కుల అభివృద్ధి, నిర్వహణ కోసం మున్సిపాలిటీ దృష్టి సారించ పోవడంతో అవి అధ్వానంగా మారాయని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. పార్కుల్లో ఉన్న సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు సరి చేయడం, అవసరమైన చోట కొత్త ఆటవస్తువులు ఏర్పాటు చేయడం, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ దీపాలు వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. పార్కుల వారీగా సిబ్బందిని నియమించి నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతో పాటు అధికారులు తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. కానీ అలాంటిదేమీ చేయక పోవడంతో అవి ప్రజలకు ఆహ్లాదాన్ని అందించలేక పోతున్నాయి. మున్సిపల్ అధికారులు పార్కుల నిర్వహణపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
సూర్యాపేటలో పార్కుల
నిర్వహణపై నిర్లక్ష్యం
ఫ శిథిలావస్థలో పిల్లల ఆటవస్తువులు
ఫ మరమ్మతుల నోచని ఆటల, వ్యాయామ పరికరాలు
ఫ అపరిశుభ్ర వాతావరణంతో అవస్థలు
పార్కుల నిర్వహణను ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నాం. కొన్ని పార్కుల్లో పిల్లల ఆట వస్తువులు మరమ్మతులకు గురయ్యాయి. వాటి మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపించాం. నిధులు రాగానే మరమ్మతులు చేయిస్తాం. కృష్ణకాలనీ, జమ్మిగడ్డలోని హౌసింగ్‌బోర్డు పార్కుకు సంబంధించి ఆట వస్తువులకు కలెక్టర్ నిధుల నుంచి కేటాయిస్తామన్నారు. అన్ని పార్కుల్లో పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటాం.
–సీహెచ్.హన్మంతరెడ్డి,
మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట


