హుజూర్‌నగర్ : మున్సిపాలిటీ నిధుల ఖర్చుపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిందేనని పలువురు కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కౌన్సిల్ హాల్లో జరిగింది. సమావేశం ప్రారంభమైన కొద్ది సేపటికే పలువురు మహిళా కౌన్సిలర్లు లేచి రూ.6 కోట్ల మున్సిపల్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ నిధులను ఎక్కడ, ఎలా ఖర్చు చేశారో వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ పాలనలో పారదర్శకత ఉండాలని, ప్రజాధనానికి సంబంధించిన ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. ఈ విషయమై అధికారుల వివరణకు సంతృప్తి చెందని కొందరు కౌన్సిలర్లు సభ నుంచి బయటికి వెళ్లి పోయారు. అనంతరం మున్సిపాలిటీ ఆదాయ, వ్యయాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల వినియోగంపై సభ్యులు చర్చించారు. ముఖ్యంగా కొంతకాలంగా పట్టణంలో చర్చనీయాంశంగా మారిన రూ. 6 కోట్ల నిధుల అవినీతి ఆరోపణలపై చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సతీష్ వివరణ ఇచ్చారు. సమావేశంలో కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అవినీతి ఆరోపణల్లో వాస్తవం లేదు : చైర్మన్
మున్సిపాలిటీలో రూ.6 కోట్ల అవినీతి జరిగిందంటూ కొందరు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంగళవారం మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపాలిటీకి వివిధ మార్గాల ద్వారా ఏడాదికి సుమారు రూ. 3.30 కోట్లు ఆదాయం వస్తుందని, ఇందులో ఉద్యోగులు, కార్మికుల జీతాలు, వాహనాల అద్దెలు, డీజిల్ ఖర్చులు, కౌన్సిలర్ల గౌరవ వేతనాలు, నిర్వహణ కోసం నెలకు సుమారు రూ.3 కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. మిగిలిన వాటిని పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ సతీష్, పలువురు కౌన్సిలర్లు, అధికారులు ఉన్నారు.
ఫమున్సిపల్ సమావేశంలో నిలదీసిన కౌన్సిలర్లు


