నేడు హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్‌ పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్‌ పర్యటన

Nov 11 2026 3:51 AM | Updated on Nov 11 2026 3:51 AM

హుజూర్‌నగర్‌ : రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి బుధవారం హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం హెలికాప్టర్‌లో పాలకీడుకు చేరుకుంటారు. రూ. 400 కోట్లతో చేపడుతున్న జాన్‌ పహాడ్‌ లిఫ్ట్‌, కాలువ లైనింగ్‌ పనులను, రూ. 40 కోట్లతో చేపడుతున్న బెట్టె తండా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌, చెక్‌డ్యామ్‌ పనులను మంత్రి పరిశీలిస్తారు. అనంతరం హుజూర్‌నగర్‌ మండలం కరక్కాయలగూడెంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. హుజూర్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాల, ఇరిగేషన్‌ డివిజన్‌, ఆర్‌అండ్‌బీ భవనాల నిర్మాణ పనులను మంత్రి పర్యవేక్షస్తారు. అనంతరం అధికారులతో సమీక్షిస్తారు.

పొగమంచుతో వాహనదారులు జాగ్రత్త : ఎస్పీ

సూర్యాపేటటౌన్‌ : చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. తెల్లవారుజామున, రాత్రి సమయాల్లో పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, రోడ్డు మార్గం స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. పొగమంచు ఎక్కువగా ఉన్న సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, వాహనాలను నెమ్మదిగా నడపాలని సూచించారు. వాహనాల హెడ్‌లైట్లు, ఫాగ్‌ లైట్లు అవసరానికి అనుగుణంగా ఉపయోగించాలని, ముందు వెళ్తున్న వాహనానికి తగిన దూరం పాటించాలని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, కార్లలో వెళ్లే వారు సీట్‌బెల్ట్‌ పెట్టుకోవాలని, మద్యం సేవించి, ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని సూచించారు.

ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి తప్పనిసరి

మునగాల: గ్రామాల్లోని ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని స్వచ్ఛభారత్‌ మిషన్‌ డైరెక్టర్‌ సురేష్‌బాబు సూచించారు. మంగళవారం మండలంలోని బరాఖత్‌గూడెంలో స్వచ్ఛభారత్‌ మిషన్‌పై గ్రామస్తులకు ఆయన అవగాహన కల్పించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. అర్హులైన వారు నిబంధనల ప్రకారం మరుగుదొడ్డి నిర్మించుకుంటే ప్రభుత్వం రూ.12వేలు అందిస్తుందన్నారు. ఆయన వెంట డీపీఓ యాదగిరి, ఇన్‌చార్జి ఎంపీడీఓ నరేష్‌, గ్రామ సర్పంచ్‌ చల్లా గుర్వయ్య, కార్యదర్శి పవన్‌ ఉన్నారు.

14 నుంచి యూటీఎఫ్‌ జిల్లా మహాసభలు

ఆత్మకూరు (ఎస్‌)(సూర్యాపేట) : ఈ నెల 14, 15 తేదీల్లో హుజూర్‌నగర్‌ పట్టణంలో జరిగే తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి చిలక రమేష్‌ పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని ఏపూరు జెడ్పీహెచ్‌ఎస్‌లో మహాసభల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రారంభోత్సవ సభకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు. నూతన విద్యా విధానం తదితర అంశాలపై నిర్వహించే విద్యా సదస్సుకు డాక్టర్‌ నాగేశ్వరరావు హాజరు కానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాని, సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు లింగస్వామి, వంశి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement