మార్కెట్‌ల అభివృద్ధికి రూ.8.18 కోట్లు మంజూరు | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ల అభివృద్ధికి రూ.8.18 కోట్లు మంజూరు

Nov 7 2026 1:42 AM | Updated on Nov 7 2026 1:42 AM

హుజూర్‌నగర్‌(నేరేడుచర్ల): జిల్లాలోని మూడు వ్యవసాయ మార్కెట్‌ల పరిధిలో అభివృద్ధి పనులకు రూ.8.18 కోట్లు మంజూరైనట్లు జిల్లా మార్కెటింగ్‌ అధికారి పి.దామోదర్‌ తెలిపారు. శుక్రవారం ఆయన నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ సూర్యాపేట మార్కెట్‌కు రూ. 3.75 కోట్లు, హుజూర్‌నగర్‌కు రూ.4 కోట్లు, నేరేడుచర్ల మార్కెట్‌కు రూ.43 లక్షల నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. జిల్లాలో సీసీఐ ద్వారా చింతలపాలెంలో 2, సూర్యాపేటలో ఒకటి, తిరుమలగిరిలో 3 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పత్తిని విక్రయించే రైతులు స్లాట్‌ బుక్‌ చేసుకొని కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ఆయన వెంట నేరేడుచర్ల మార్కెట్‌ కమిటీ కార్యదర్శి సన్ని, సిబ్బంది ఉన్నారు.

లక్ష్మీనరసింహుని నిత్యకల్యాణం

మఠంపల్లి : మట్టపల్లిలోని రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మీ సమేత ప్రహ్లాద యోగానంద లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని శుక్రవారం అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ, నిత్యహోమ, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం పట్టు వస్త్రాలతో స్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం చేపట్టారు. కల్యాణోత్సవం అనంతరం స్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ప్రతిష్ఠించి ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు, అర్చకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

అధ్యాపకులు ఏఐని వినియోగించాలి

నల్లగొండ టూటౌన్‌ : ప్రాజెక్టు రూపకల్పనలో ఏఐని వినియోగించాలని ఎంజీయూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ అధ్యాపకులకు సూచించారు. ఆయన శుక్రవారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అధ్యాపకుల కోసం నిర్వహించిన ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఎఫ్‌డీపీ) ముగింపు సభలో మాట్లాడారు. మెషీన్‌ లెర్నింగ్‌ మోడళ్లు, ఏజెంటిక్‌ ఏఐ వంటి అంశాలను విద్యార్థులకు ప్రత్యేక అధ్యయన రంగాలుగా పరిచయం చేసి, ఆయా విభాగాల్లో శిక్షణ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో విభాగ అధిపతి జయంతి, ప్రిన్సిపాల్‌ హరీష్‌కుమార్‌, రేఖ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్మెంట్‌ డైరెక్టర్‌ ఆకుల రవి, అధ్యాపకులు పాల్గొన్నారు.

రైతులకు తక్షణ పరిహారం అందించాలి

సూర్యాపేట(సూర్యాపేటఅర్బన్‌): ఎల్‌నినో తో ఏర్పడిన కరువు నేపథ్యంలో పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం అందించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ధర్మ భిక్షం భవనంలో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మురసు తుపాను ప్రభావంతో వరి పంటలు నేలకొరిగి రైతులకు నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులకు ఎకరాకు వరి ధాన్యానికి రూ.30 వేలు, మిర్చి, పత్తి రైతులకు రూ.50 వేలు, ఇతర పంటలకు రూ. 20వేల చొప్పున అందించాలని కోరారు. రైతుల పక్షాన ఈ నెల 10న కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలి పారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్లావుల రాములు, బూర వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్‌ అనంతుల మల్లేశ్వరి, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement