కాంగ్రెస్‌ పార్టీకి దీర్ఘకాల భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్టీకి దీర్ఘకాల భవిష్యత్‌

Nov 7 2026 1:42 AM | Updated on Nov 7 2026 1:42 AM

సూర్యాపేట(భానుపురి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి దీర్ఘకాల భవిష్యత్‌ ఉందని, ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం పదేళ్ల పాటు కొనసాగుతుందని రాష్ట్ర ఇరిగేషన్‌, సివిల్‌ సప్లయ్‌ శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ కుటుంబం నుంచి వచ్చిన దామన్న కుమారుడు సర్వోత్తమ్‌రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రవి మహల్‌లో డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అధ్యక్షతన నిర్వహించిన నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హత గల పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. సూర్యాపేట జిల్లా నుంచి అత్యధిక మెజారిటీ రావాలన్నారు. నల్లగొండ, భువనగిరి ఎంపీలు కుందూరు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఉన్న పట్టభద్రులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విధంగానే ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా బంపర్‌ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గెలువకుంటే దెబ్బతింటామన్నారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ ఓటర్లుగా నమోదు చేయించుకునేందుకు అవకాశం ఉందని, దీనిని వినియోగించుకోవాలని సూచించారు.

పట్టభద్రుల వాయిస్‌గా ఉంటా : సర్వోత్తమ్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే పట్టభద్రుల సమస్యలపై శాసనమండలిలో వాయిస్‌ వినిపిస్తానన్నారు. 196 మండలాలు తిరిగి ప్రతి పట్టభద్రుడిని కలిసే ఓపిక, శక్తి తనకుందని పేర్కొన్నారు. సూర్యాపేట పట్టణం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలంటే రైల్వే లైన్‌ అత్యవసరమని, 60 ఫీట్ల రోడ్డు నుంచి కలెక్టరేట్‌ వరకు కనెక్టింగ్‌ రోడ్డు ఏర్పాటు చేయాలని మంత్రి ఉత్తమ్‌, ఎంపీలను ఆయన కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ కేతావత్‌ శంకర్‌నాయక్‌, వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ సభ్యుడు చెవిటి వెంకన్నయాదవ్‌, టూరిజం కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ప్రీతమ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పోతు భాస్కర్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు అనురాధ, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వంగవీటి రామారావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మొరిశెట్టి నివేదిత లక్షాది, మార్కెట్‌ చైర్మన్‌ కొప్పుల వేణారెడ్డి, వైస్‌ చైర్మన్‌ గట్టు శ్రీనివాస్‌, గోరెంట్ల సర్పంచ్‌ రామ్మూర్తి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఫొటో వివాదం

సమావేశంలో ఫొటో వివాదం చర్చకు దారితీసింది. మంత్రి ఉత్తమ్‌తో పాటు ఎంపీ రఘువీరారెడ్డి వేదికపైకి వచ్చే సమయంలో సూర్యాపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొప్పుల వేనారెడ్డి ఫొటోను ఫ్లెక్సీపై పెట్టలేదని ఆయన అనుచరులు నినాదాలు చేశారు. వేదిక వద్దకు దూసుకు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫ సర్వోత్తమ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత అందరిది

ఫ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement