తండాల్లో రేషన్‌ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

తండాల్లో రేషన్‌ కష్టాలు

Nov 7 2026 1:42 AM | Updated on Nov 7 2026 1:42 AM

తుంగతుర్తి : నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల్లో ప్రజలకు రేషన్‌ కష్టాలు తప్పడం లేదు. 2019లో 500 జనాభా ఉన్న గ్రామాలు, తండాలను ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా మార్చిన ప్రభుత్వం.. ప్రతి పంచాయతీకి ఒక రేషన్‌ షాపు ఏర్పాటు చేస్తామని అప్పట్లో ప్రకటించింది. కానీ ఏళ్లు గడుస్తున్నా ఆ హామీ అమలుకు నోచుకోవడం లేదు. దాంతో కొత్త గ్రామపంచాయతీల ప్రజలు ప్రతి నెలా రేషన్‌ సరుకుల కోసం పక్క ఊర్లకు వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. తండాలకు సరైన రవాణా వ్యవస్థలేక సరుకులను ఇంటికి చేర్చేందుకు అవస్థలు పడుతున్నారు.

ఆరు పంచాయతీల్లో..

తుంగతుర్తి మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉండగా.. వీటిలో 18 పంచాయతీలలో మాత్రమే రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. మరో 6 గ్రామ పంచాయతీల ప్రజలు రేషన్‌ సరుకులు తెచ్చుకునేందుకు పక్క గ్రామాలకు వెళ్తున్నారు. మండలంలోని సూర్యతండా, మంచ్చాతండా, బాపన్‌ బావితండా, కాశి తండా, కేశవాపురం, దేవుని గుట్టతండా గ్రామాలలో రేషన్‌ దుకాణాలు లేవు. దాంతో ఆయా తండాల ప్రజలు పక్కన ఉన్న గ్రామాలకు వెళ్లి సరుకులు తెచ్చుకోవడానికి అవస్థలు పడుతున్నారు.

అదనపు ఖర్చు

రేషన్‌ దుకాణాలు లేని గ్రామాల ప్రజలు ప్రతినెలా 2 నుంచి 5 కిలోమీటర్ల దూరం వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. పక్క గ్రామానికి వెళ్లి రేషన్‌ తెచ్చుకోవాలంటే రాను పోను చార్జీలు రూ. 50 నుంచి 100 వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. రేషన్‌ దుకాణానికి వెళ్లిన సందర్భంలో అక్కడ సిగ్నల్స్‌ లేకపోయినా, వేలిముద్రలు పడకపోయినా బియ్యం ఇవ్వడం లేదని, మరుసటి రోజు మళ్లీ వెళ్లాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. దాంతో రెండు రోజుల పాటు పని మానేసి తిరగాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నూతన గ్రామ పంచాయతీల్లో రేషన్‌ దుకాణాలు ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

కొత్త గ్రామపంచాయతీల్లో రేషన్‌ దుకాణాలు లేక అవస్థలు

ఫ పక్క గ్రామాలకు వెళ్లి బియ్యం తెచ్చుకోవాల్సిన దుస్థితి

ఫ సర్వర్‌ సమస్యలతో రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి

ఫ అధికారులు స్పందించాలని వేడుకోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement