విద్యుత్‌ బిల్లుల బాదుడు! | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ బిల్లుల బాదుడు!

Nov 6 2026 2:14 AM | Updated on Nov 6 2026 2:14 AM

వినియోగదారులపై ట్రూఅప్‌ చార్జీల పేరిట అదనపు భారం

కోదాడ: జిల్లావ్యాప్తంగా ఉన్న విద్యుత్‌ వినియోగదారులపై ఈనెల నుంచి ‘ట్రూఅప్‌ చార్జీల’ పేరుతో అదనపు భారం పడుతోంది. విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇంధన కొనుగోలు, పంపిణీల వల్ల తమపై పడిన అదనపు వ్యయాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవడానికి తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది. దీంతో నవంబర్‌ బిల్లులోనే ట్రూఅప్‌ పేరుతో అదనపు మొత్తాన్ని చేర్చి వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగిస్తున్న నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ చార్జీల నుంచి ఊరట లభించింది. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌ వాడుతున్న రైతులకు కూడా ట్రూఅప్‌ చార్జీల నుంచి మినహాయింపునిచ్చారు.

ఈనెలలో 4 కోట్లు.. డిసెంబర్‌లో 7 కోట్లు

జిల్లాలో మొత్తం 3,06,885 గృహ విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా.. అందులో 1,79,929 కనెక్షన్లు గృహజ్యోతి కింద ఉన్నాయి. మిగిలిన 1,26,956 సాధారణ గృహ వినియోగదారులు సగటున నెలకు రూ.100 నుంచి రూ.150 వరకు ట్రూఅప్‌ పేరిట అదనంగా చెల్లించాల్సి వస్తోంది. దీనిభారం సుమారు రూ.1.50 కోట్ల వరకు ఉంది. ఇక జిల్లాలోని 30,995 కమర్షియల్‌ కనెక్షన్లదారులు నెలకు రూ.400 నుంచి రూ.500 వరకు చెల్లించాల్సి రాగా, ఇది మరో రూ.1.25 కోట్ల వరకు భారమవుతోంది. జిల్లాలోని 2,812 పరిశ్రమల యజమానులపై నెలకు రూ.2వేల నుంచి రూ.5వేల చొప్పున సుమారు రూ.కోటి వరకు భారం పడుతోంది. నవంబర్‌ నెలలో యూనిట్‌కు 30 పైసల చొప్పున వసూలు చేయడంతోనే జిల్లావ్యాప్తంగా అన్ని వర్గాలపై రూ.4 కోట్ల భారం పడుతోంది. డిసెంబర్‌ నుంచి ఈ చార్జీని యూనిట్‌కు 50 పైసలకు పెంచనుండటంతో పడే అదనపు భారం ఏకంగా నెలకు రూ.7 కోట్ల వరకు చేరుతుందని విద్యుత్‌ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ బాదుడు ఇంకో నెల రోజులతో ఆగకుండా ఏకంగా 29 నెలల పాటు సాగనుంది.

కమర్షియల్‌ దుకాణాల్లో కిరికిరి

విద్యుత్‌ ట్రూఅప్‌ చార్జీల వసూలు కమర్షియల్‌ దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కొత్త వివాదాలకు దారితీస్తోంది. 2022–23లో వేరేవాళ్లు వ్యాపారం చేసి ఖాళీ చేయగా, కొత్తగా దుకాణాలను అద్దెకు తీసుకున్న ప్రస్తుత వ్యాపారులు.. గతంలో వాడుకున్న విద్యుత్‌కు ఇప్పుడు తామెందుకు ట్రూఅప్‌ చార్జీలు కట్టాలని ప్రశ్నిస్తున్నారు. కోదాడలోని ఒక బహుళ అంతస్తుల భవనాన్ని గతంలో ఒక షోరూమ్‌ వారు అద్దెకు తీసుకుని భారీగా విద్యుత్‌ వినియోగించారు. ఏడాది క్రితం వారు ఖాళీ చేసి వెళ్లపోగా ప్రస్తుతం ఆ భవనం ఖాళీగానే ఉంది. అయితే ఈ నెలలో సదరు భవన యజమానికి గతంలో వాడుకున్న ట్రూఅప్‌ చార్జీల పేరుతో వేల రూపాయల బిల్లు రావడంతో ఆ యజమాని లబోదిబోమంటున్నాడు.

ప్రస్తుతం యూనిట్‌కు 30 పైసలు.. డిసెంబర్‌ నుంచి 50 పైసలకు పెంపు

29 నెలల పాటు కట్టాల్సిందే

గృహజ్యోతి, వ్యవసాయ

వినియోగదారులకు మినహాయింపు

జిల్లాలో విద్యుత్‌ కనెక్షన్‌లు ఇలా..

మొత్తం గృహ విద్యుత్‌ కనెక్షన్‌లు : 3,06,885

ఉచిత విద్యుత్‌ పొందుతున్న

గృహ కనెక్షన్లు : 1,79,929

వ్యాపార కనెక్షన్లు : 30,995

పరిశ్రమ కనెక్షన్లు : 2,812

ఉచిత వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు : 1,54,220

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement