సూర్యాపేట(సూర్యాపేటటౌన్) : శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలో ఈనెల 30 వరకు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని ఎస్పీ నరసింహ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాక్ట్ అమలులో ఉన్నందున డీఎస్పీ లేదా ఆపై స్థాయి అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమి గుడి ఉండేవిధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని, సన్నాహాలు చేయరాదని పేర్కొన్నారు. ఆయుధాలు, కత్తులు, కర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు కలిగి ఉండొద్దని పేర్కొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
సూర్యాపేట(సూర్యాపేటటౌన్) : రాష్ట్రవ్యాప్తంగా మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎంఎస్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్, డీఈఓ శ్రీనివాసరావులకు వినతి పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానానికి బదులుగా 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, ఉపాధ్యాయులు మరణిస్తే.. బాధిత కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. అదేవిధంగా డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏ వెంటనే చెల్లించాలని, మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు ఈహెచ్‌ఎస్ ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఎంఎస్ జేఏసీ నాయకులు భూతం యాకమల్లు, క్రాంతి, రాజయ్య, బాబు, రమేష్, వీరారెడ్డి, కరుణాకర్, శ్రీను, శ్రీధర్, సుధాకర్, తిరుమలేష్, వీరశేఖర్, సంతోష్ తదితరులున్నారు.
నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు సాగుచేయాలి
కోదాడరూరల్ : ఎల్‌నినో నేపథ్యంలో రైతులు నీటి ఎద్దడిని తట్టుకునే ఆరుతడి పంటలను సాగు చేయాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు చంద్రశేఖర్, శివప్రసాద్ అన్నారు. రైతు పొలాల్లో ఆవిష్కరణలు కార్యక్రమంలో భాగంగా గురువారం కోదాడ మండలంలోని కాపుగల్లు రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతులకు పెసర, మినుము విత్తనాలను పంపిణీ చేసి మాట్లాడారు. రైతులు తక్కువ నీటితో సాగయ్యే కూరగాయలతో పాటు పెసర, మినుము, బొబ్బెర పంటలను సాగు చేసి అఽధిక ఆదాయం పొందాలన్నారు. అదే విధంగా నత్రజనిని స్థిరీకరించే సూక్ష్మజీవుల మిశ్రమాన్ని పంపిణీ చేసి వాటి ఉపయోగాలను రైతులకు వివరించారు. పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలని దీంతో పంట దిగుబడులు పెరగడంతో పాటు చీడపీడలు తగ్గుతాయని తెలిపారు.
పరిహారం అందేలా చూస్తాం
హుజూర్‌నగర్ : దేవస్ధాన భూములకు సంబంధించి నష్ట పరిహారం వచ్చే విధంగా పైఅధికారులతో మాట్లాడుతామని హౌసింగ్ సీఈ చైతన్య కుమార్, పీడీ జబ్బర్ అహ్మద్ అన్నారు. గురువారం హుజూర్‌నగర్ పరిధిలోని ఫణిగిరి సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని వారు సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేవస్థానానికి రావాల్సిన భూముల పరిహారానికి సంబంధించి మిగిలిన 20 శాతం నగదు వీలైనంత త్వరగా మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. వారి వెంట దేవస్థాన ఫౌండర్ ట్రస్టీ ముడుంబ జగన్నాథాచార్యులు, హౌసింగ్ శాఖ డీఈ జగన్, కాంట్రాక్టర్ రవీందర్ రావు, వెంకటప్రసాద్ ఉన్నారు.


