అమృత్‌ పనులు సగమే.. | - | Sakshi
Sakshi News home page

అమృత్‌ పనులు సగమే..

Nov 6 2026 2:14 AM | Updated on Nov 6 2026 2:14 AM

సూర్యాపేటటౌన్‌ : పట్టణ ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్‌ 2.0 పథకం పనులు సూర్యాపేటలో నత్తనడకన సాగుతున్నాయి. రూ.30 కోట్ల వ్యయంతో మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన ఐదు వాటర్‌ ట్యాంకుల నిర్మాణాల్లో ఇప్పటివరకు రెండు మాత్రమే తుదిదశకు చేరుకోగా, మిగతా మూడు ట్యాంకుల నిర్మాణాలు సగం కూడా పూర్తి కాలేదు. 2024లో ప్రారంభమైన ఈ పనులకు మార్చి 2027 వరకు గడువు ఉన్నప్పటికీ, నిర్మాణాల పురోగతి ఆశించిన స్థాయిలో లేదు. సంబంధిత పబ్లిక్‌ హెల్త్‌, మున్సిపల్‌ అధికారుల పర్యవేక్షణ లోపించడమే ఈ జాప్యానికి ప్రధాన కారణమనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఐదు ప్రాంతాల్లో నిర్మాణాలు..

సూర్యాపేట పట్టణంలోని పిల్లలమర్రి సమీపంలో, హనుమాన్‌నగర్‌, గాంధీనగర్‌, బీబీగూడెం, ఆర్‌కే గార్డెన్‌ ప్రాంతాల్లో అమృత్‌ ట్యాంకుల నిర్మాణ పనులు చేపట్టారు. ఈ ట్యాంకుల ద్వారా 15 కిలోమీటర్ల మేర నూతన పైపులైన్లు ఏర్పాటు చేసి, 1,800 కుటుంబాలకు తాగునీటి నల్లా కనెక్షన్లు అందించాలనేది ప్రధాన లక్ష్యం. పిల్లలమర్రి సమీపంలో, గాంధీనగర్‌లో చేపట్టిన ట్యాంకుల నిర్మాణాలు తుదిదశకు చేరుకున్నాయి. బీబీగూడెం, ఆర్కే గార్డెన్‌, హనుమాన్‌నగర్‌ వంటి ప్రాంతాల్లో నిర్మాణాలు ఇప్పటికీ పిల్లర్ల దశలోనే ఉన్నాయి. పనులు ప్రారంభించి రెండేళ్లు దాటుతున్నా ట్యాంకుల నిర్మాణాలు సగం కూడా పూర్తికాకపోవడం అధికా రుల పనితీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

తాగునీటి కొరతకు మోక్షమెప్పుడు..

సూర్యాపేట పట్టణంలోని పలు కాలనీల్లో ఇప్పటికే వేసవి రాకముందే తాగునీటి కొరత వేధిస్తోంది. కొత్త ట్యాంకుల నిర్మాణాలు పూర్తయి, పైపులైన్లు, నల్లా కనెక్షన్లు అందుబాటులోకి వస్తే ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందుతుంది. కానీ పనుల్లో జాప్యం వల్ల ఆ ఫలితం ప్రజలకు అందడం లేదు. నిర్ణీత గడువైన మార్చి 2027 నాటికై నా ఈ పనులు పూర్తవుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి పనుల్లో వేగం పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో పూర్తికాని వాటర్‌ ట్యాంకుల నిర్మాణాలు

రెండేళ్లు గడిచినా మూడు ట్యాంకులు ఇంకా పిల్లర్ల దశలోనే..

తీవ్రమవుతున్న తాగునీటి ఎద్దడి పనులు వేగవంతం చేయాలని వేడుకోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement