సూర్యాపేటటౌన్: సూర్యాపేట నుంచి జనగామ వెళ్లే ప్రధాన రహదారితో పాటు విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారుల వెంట ఉన్న పలు దాబాలు, కిరాణా దుకాణాలు అక్రమ మద్యం విక్రయాలకు అడ్డాలుగా మారుతున్నాయి. రాత్రి వేళల్లో వాహనదారులు దాబాల వద్ద ఆగి మద్యం సేవించి, అదే మత్తులో వాహనాలు నడుపుతుండటంతో రోడ్డు ప్రమాదాల ముప్పు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మద్యం మత్తులో స్టీరింగ్ పట్టి వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాలు జరిగి, సదరు డ్రైవర్లతో పాటు ఎదురుగా వచ్చే ఇతర వాహనదారులు, ప్రయాణికుల ప్రాణాలు కూడా గాల్లో దీపాల్లా మారుతున్నాయి.
దాబాలే కాకుండా కిరాణా దుకాణాల్లోనూ..
రహదారుల వెంట కేవలం దాబాలే కాకుండా కొన్ని కిరాణా దుకాణాల్లో సైతం మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బయటకు సాధారణ కిరాణా షాపులుగా కనిపిస్తున్నా.. లోపల మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ విక్రయాలు మరీ తీవ్రమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొన్ని దాబాల్లోనైతే ఏకంగా ఓపెన్‌గానే ఫ్రిజ్‌లలో బీర్లు ఉంచి అమ్ముతున్నట్లు సమాచారం.
తనిఖీలు శూన్యం
మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని పోలీసులు ఒకవైపు అవగాహన కల్పిస్తున్నప్పటికీ, మరోవైపు రహదారుల పక్కనే సులభంగా మద్యం అందుబాటులో ఉంచడం గమనార్హం. దాబాల్లో మద్యం విక్రయాలకు ఎవరు అనుమతిస్తున్నారు? కిరాణా దుకాణాల మాటున బెల్ట్ షాపులు ఎలా కొనసాగుతున్నాయి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి రాత్రి వేళల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని, అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
సూర్యాపేట పరిధిలోని హైవేలపై
అక్రమంగా మద్యం విక్రయాలు
తాగి స్టీరింగ్ పడుతున్న డ్రైవర్లతో
పొంచి ఉన్న రోడ్డు ప్రమాదాలు
దాబాలు, కిరాణా దుకాణాల్లో మద్యం విక్రయిస్తే సహించేది లేదు
రహదారుల వెంట ఉన్న దాబాల్లో మద్యం విక్రయాలు చేస్తే సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. దాబాల్లో ఎలాంటి మద్యం విక్రయాలు జరపకూడదు. అలాగే రాత్రి వేళల్లో కిరాణా దుకాణాలు లేదా బెల్టు షాపుల్లో మద్యం విక్రయించినా సహించేది లేదు. – నరసింహ, ఎస్పీ


