భానుపురి (సూర్యాపేట) : జిల్లా మత్స్యశాఖ అవినీతి, అక్రమాలకు నిలయంగా మారింది. జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ పనిచేసిన ప్రతి అధికారిపైనా ఏదో ఒక రీతిలో అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇతర ఏ శాఖలోనూ ఈ స్థాయిలో వరుస ఫిర్యాదులు, ఆరోపణలు వచ్చిన దాఖలాలు లేవు. మత్స్య సొసైటీలలో సభ్యత్వాల నమోదు నుంచి మొదలుకొని చేపల వేటకు అనుమతుల వరకు ప్రతి పనిలోనూ ఈ శాఖ అధికారులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా నేరుగా ఏసీబీకి చిక్కడం, సస్పెన్షన్‌కు గురికావడం పరిపాటిగా మారింది. ఇటీవల జిల్లా ఇన్‌చార్జ్ మత్స్య శాఖ అధికారి ఆంజనేయస్వామి సస్పెండ్ కావడంతో ఈ శాఖ పనితీరుపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.
ఫిర్యాదులు ఎన్నో..
జిల్లా మత్స్య శాఖపై వచ్చిన ఫిర్యాదులు, జరిగిన ఆందోళనలు అన్నీఇన్నీ కావు. జిల్లా ఏర్పడిన ప్రారంభంలో జిల్లా అధికారిగా పనిచేసిన సౌజన్యపై అప్పట్లో పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. అర్హతలు లేకున్నా సభ్యత్వాలు ఇస్తున్నారని మత్స్యకారులు నిత్యం కార్యాలయం ఎదుట ఆందోళనలు చేసేవారు. ఆ తర్వాత వచ్చిన రూపేందర్ సింగ్ కారా్యాలయ సిబ్బంది సహకారంతో అక్రమాలకు పాల్పడుతూ, లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అనంతరం వచ్చిన అధికారి సైతం గతంలో ఏసీబీకి చిక్కిన చరిత్ర ఉన్నవారే కావడం గమనార్హం. ఇక సాధారణ బదిలీల్లో భాగంగా ఇన్‌చార్జ్ బాధ్యతలు స్వీకరించిన ఆంజనేయస్వామి.. 2024లో ఖమ్మం డీఎఫ్‌ఓగా పనిచేస్తూ అక్రమ సభ్యత్వాల నమోదు, పునరుద్ధరణకు పాల్పడినట్లు రుజువు కావడంతో ఉన్నతాధికారులు ఇటీవల ఆయనను సస్పెండ్ చేశారు. ఇలా జిల్లాలో పనిచేసిన అధికారులపై ఆరోపణలు రావడం, ఏసీబీకి చిక్కడం, ఇతర జిల్లాలో పనిచేసిన సమయంలోనూ ఇలాంటి ధోరణి ఉండడంతో సూర్యాపేట మత్స్య శాఖకు శరాఘాతంగా మారింది. ప్రధానంగా జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఇక్కడికి వచ్చి అధికారికి అండగా ఉంటూ.. తలా ఇంత వెనకేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
జిల్లా మత్స్య శాఖలో వెల్లువెత్తుతున్న అవినీతి, అక్రమాల ఆరోపణలు
సభ్యత్వాల నమోదు, ఉచిత చేప పిల్లల
టెండర్లలో రూ.లక్షల వసూళ్లు
గతంలో ఏసీబీకి చిక్కిన డీఎఫ్‌ఓ
ఇటీవల సస్పెన్షన్‌కు గురైన మరో అధికారి
అక్రమాలు జరుగుతున్నాయిలా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అప్పటి ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అలాగే మత్స్యకారులు చేపలను విక్రయించుకునేందుకు మోపెడ్ల నుంచి టాటా ఏస్ వాహనాల వరకు సబ్సిడీపై అందించింది. ఈ క్రమంలో మత్స్య సొసైటీల్లో సభ్యులుగా ఉన్న వారికే ప్రభుత్వ సాయం పొందే అవకాశం ఉండటంతో సభ్యత్వాలకు తీవ్ర డిమాండ్ పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుని ఒక్కో సభ్యత్వానికి రూ.10 వేల వరకు వసూలు చేశారనే విమర్శలున్నాయి. అంతేకాకుండా చేపలు పట్టుకునేందుకు అవసరమైన అనుమతులకు సైతం సొసైటీల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ టెండర్ల ఖరారు నుంచి చెరువుల్లో చేపలను వదిలే వరకు అంతా అక్రమాలే రాజ్యమేలుతున్నాయి. ఇందుకు జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బంది అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి.


