సూర్యాపేట (భానుపురి) : జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామాలను గుర్తించి సమస్యలను పరిష్కరించాలన్నారు. తాగునీటి సరఫరాతో పాటు నీటి శుద్ధి, క్లోరినేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రామాలు, ఆవాసాల వారీగా తాగునీటి పరిస్థితిని అంచనా వేసి గ్రీన్, ఎల్లో, రెడ్ కేటగిరీలుగా విభజించాలని తెలిపారు. గ్రామాలు, మున్సిపాలిటీల వారీగా తాగునీటి సరఫరా పరిస్థితిపై ప్రత్యేక ప్రొఫార్మా ద్వారా వివరాలు సేకరించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా వ్యవస్థల ద్వారా నీటి సరఫరా, స్థానిక నీటి వనరుల పరిస్థితిని అంచనా వేయాలన్నారు. మండలాలు, గ్రామాల వారీగా అవసరమైన పనులు, వాటి అంచనా వ్యయాలతో కూడిన నివేదికను వారం రోజుల్లో సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలకు 15 రోజుల్లోగా మిషన్ భగీరథ కనెక్షన్లు అందించాలని స్పష్టం చేశారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు తాగునీరు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న నీటిలో సుమారు 20 నుంచి 25 శాతం వరకు వృథా అవుతున్నట్లు గుర్తించామని, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాస్తవ పరిస్థితిని వారం రోజుల్లో నివేదించాలని కోరారు. భూగర్భ జలాల పరిస్థితిపై ప్రతి 15 రోజులకు ఒకసారి నివేదిక ఇవ్వాలని గ్రౌండ్ వాటర్ అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, డీఆర్డీఓ సన్యాసయ్య, జెడ్పీ సీఈఓ శిరీష, డీపీఓ యాదగిరి, మిషన్ భగీరథ ఈఈ అరుణాకర్ రెడ్డి, డీడబ్ల్యూఓ నరసింహారావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రుణాలను రీషెడ్యూల్ చేయాలి
సూర్యాపేట (భానుపురి) : కరువు మండలాల్లో బ్యాంకర్లు వ్యవసాయ రుణాలను రీ షెడ్యూల్ చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటనాగప్రసాద్ రుణాల లక్ష్యాలను కలెక్టర్‌కు వివరించారు. జిల్లా వార్షిక ప్రణాళికలో వార్షిక బడ్జెట్ 13336.67 కోట్లను లక్ష్యంగా పెట్టుకుంటే గడిచిన ఆరు నెలల కాలంలో 8209.78 కోట్ల వృద్ధి సాధించినట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్‌డీఓ సన్యాసయ్య, జనరల్ మేనేజర్ భారతి, బీసీ సంక్షేమ అధికారి విశాల్ ధార, ఎస్సీ సంక్షేమ అధికారి లత, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ ఉపేందర్ రావు పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


