తిరుమలగిరి (తుంగతుర్తి) : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈఓ) సీహెచ్.శ్రీనివాసరావు అన్నారు. శనివారం తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చదవడం, రాయడం ప్రక్రియను పరిశీలించారు. సెల్‌ఫోన్‌లో వీడియో పాఠాలను స్వయంగా విద్యార్థులకు చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. పాఠశాలలో మౌలిక వసతులపై ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఐ.శాంతయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.అశోక్‌రెడ్డి, ఉపాధ్యాయులు కవిత, సత్యనారాయణరెడ్డి, వెంకటరామనర్సయ్య, సౌమ్యాబాయి, గిరి, సీఆర్‌పీ నరేష్ పాల్గొన్నారు.
బియ్యం దుకాణాల్లో అధికారుల తనిఖీలు
సూర్యాపేట : ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని పలు బియ్యం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 కేసులు నమోదు చేసినట్లు లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ పి.నాగేశ్వరరావు తెలిపారు. బియ్యం తూకం సరిగా ఉండేలా చూసుకోవాలని వ్యాపారులకు సూచించారు. తక్కువ తూకంతో వినియోగదారులను మోసం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
సమస్యలపై స్పందించకుంటే మహాధర్నా చేపడతాం
సూర్యాపేటటౌన్ : తమ దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మోడల్ స్కూల్స్ టీచర్లు జిల్లాలో రెండో రోజు నిరసనలు కొనసాగించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 33 మోడల్ స్కూల్స్‌లో ఉపాధ్యాయులు శనివారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీల ధరించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు మాట్లాడుతూ రెండున్నరేళ్లుగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. గతనెల 8న మోడల్ స్కూల్స్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నోటీసు అందజేసినప్పటికీ స్పందన రాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుట్టామన్నారు. దీంట్లో భాగంగా ఈ నెల 17న హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి మహా ధర్నా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఈ ధర్నాకు మోడల్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.


