సీఎంఆర్ అందించని మిల్లుల్లో ఇప్పటికే విజిలె న్స్ తనిఖీలు
జిల్లాలోని కొందరు మిల్లర్లు ధాన్యాన్ని పక్కదారి పట్టించి ప్రభుత్వానికి ఎగ్గొట్టిన ధాన్యం విలువ రూ. 500 కోట్ల వరకు ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సకాలంలో బియ్యం ఇవ్వకుండా డీఫాల్టర్‌లుగా మారిన మిల్లులో అధికారుల తనిఖీల సమయంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి తోడు ఇటీవల ప్రభుత్వం విజిలెన్‌న్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో దాడులు చేయించగా దాదాపు 16 మిల్లులో సుమారు 1.29 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా బియ్యం పక్కదారి పట్టిన జిల్లాగా ఇప్పటివరకు సూర్యాపేట ఉన్నట్లు సమాచారం.
భానుపురి(సూర్యాపేట) : జిల్లాలో అక్రమాలకు పాల్పడిన మిల్లర్లకు సీఐడీ దడ పట్టుకుంది. కస్టమ్ మిల్లింగ్ రైస్ ధాన్యం పక్కదారి పట్టించడం, సన్న బియ్యానికి బదులు దొడ్డు బియ్యం సరఫరా చేయడం వంటి అక్రమాలపై విజిలెన్స్ ఎన్‌్ ఫోర్స్‌మెంట్, సీఐడీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కఠిన చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలోనూ సన్న బియ్యం బదులు దొడ్డు బియ్యం ఇచ్చిన ఆరుగురు రైస్ మిల్లర్లపై కేసులు నమోదు చేశారు. వారిని సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన మిల్లర్లకు సీఐడీ అధికారుల దడ పట్టుకుంది. వీరికి సహకరించిన అధికారులు సైతం ఇదే టెన్షన్‌లో ఉన్నారు.
సకాలంలో ఇవ్వకుండా..
ప్రభుత్వం వానాకాలం, యాసంగి సీజన్లలో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు కేటాయించి వారి నుంచి బియ్యాన్ని తీసుకుంటుంది. ప్రభుత్వ నిబంధనల మేరకు తిరిగి అప్పగించాల్సిన బియ్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యానికి బదులు బియ్యాన్ని తిరిగి ఇవ్వకుండా సొంత వ్యాపారం చేస్తూ కోట్లది రూపాయలు కూడగడుతున్నారు. ప్రభుత్వం గడువు పెంచుతున్నా తిరిగి అప్పగించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
సీఐడీ అధికారుల సోదాలు
రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అధికారుల దాడుల్లో అక్రమాలు వెలుగు చూసిన మిల్లులను సీఐడీ అధికారులు తిరిగి తనిఖీ చేస్తున్నారు. మిల్లుల యజమానులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలువురు మిల్లర్లను సీఐడీ అధికారులు విచారించినట్లు సమాచారం. కొందరు మిల్లర్లు సన్నబియ్యానికి బదులుగా దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి కొంతమేర సీఎంఆర్ బకాయిలను పూడ్చుకున్నట్లు విచారణలో వెలుగు చూసింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న అధికారులు బియ్యం ఇవ్వకుండా పక్కదారి పట్టించడం, సన్నబియ్యానికి బదులుగా దొడ్డు బియ్యాన్ని ఇస్తున్న మిల్లర్లపై ఉక్కు పాదం మోపుతున్నారు. దాంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన మిల్లర్లలో నెలకొంది. అక్రమాలకు పాల్పడే మిల్లర్లకు సహకరిస్తున్న అధికారులకు సైతం ఇదే టెన్షన్ పట్టుకుంది. కేవలం కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకొని జిల్లాలో అక్రమాలకు సహకరించే అధికారులను వదిలేశారన్న విమర్శలు సైతం వ్యక్తం అవుతున్నాయి. సీఐడీ అధికారుల రంగప్రవేశంతో వారిని సైతం విచారించే అవకాశం ఉంది.
ఫ పలు మిల్లుల్లో భారీగా
అక్రమాలు వెలుగులోకి
ఫ రంగంలోకి సీఐడీ అధికారులు
ఫ విచారణతో పాటు మిల్లర్ల అరెస్టులు
ఫ మిల్లర్లు, అధికారుల్లోనూ భయాందోళన


