రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రాహత్ పథకం బాధితులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సమీపంలోని ఎంపిక చేసిన ఆసుపత్రులకు తరలించి అత్యవసర వైద్య సేవలు అందించాలి. జిల్లాలోని 38 ఆస్పత్రుల్లో ఈ పథకం కింద వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు ప్రజలు ముందుకు రావాలి.
– డాక్టర్ పెండెం వెంకటరమణ, డీఎంహెచ్‌ఓ
సూర్యాపేటటౌన్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ వైద్యసాయం అందించేందుకు కేంద్రం ప్రభుత్వం పీఎం రహత్ పథకం అమలు చేస్తున్నది. ప్రమాదం జరిగినప్పుడు అత్యంత కీలకమైన తొలిగంటలోనే వైద్యం అందించి ప్రాణాలు రక్షించడంతో పాటు బాధిత కుటుంబంపై చికిత్స ఖర్చుల భారం తగ్గించేందుకు ఈ పథకం దోహద పడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించనున్నారు.
జిల్లాలో 38 ఆసుపత్రుల్లో
జిల్లాలోని 38 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ పథకం కింద వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు, ఏడు రోజులపాటు నగదు రహిత వైద్యం అందిస్తారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తే చాలు అతడికి ఈ పథకం కింద అత్యవసర చికిత్స అందిస్తారు. ప్రమాదం జరిగిన క్షణం నుంచి ఏడు రోజు వరకు అయ్యే అన్ని రకాల అత్యవసర వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా బాధితులకు ఆసుపత్రులు వైద్యం నిరాకరించకూడదన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
112 నంబర్‌తో తక్షణ సాయం..
ప్రమాదం జరిగిన వెంటనే బాధితులు, లేదా స్థానికులు 112 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి సమీపంలోని నెట్‌వర్క్ ఆస్పత్రుల వివరాలతో పాటు అంబులెన్స్ సదుపాయాన్ని పొందవచ్చు. పీఎం రహత్ పథకం అమలు మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుగుతుంది. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేవరకు అంతా ఆన్‌లైన్‌లో పారదర్శకంగా సాగుతుంది. రాష్ట్ర ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపిన పది రోజుల్లోనే ఆయా ఆసుపత్రలకు రోగి తాలూకు బిల్లులు వస్తాయి.
ఫ రూ.1.50 లక్షల వరకు
ఉచితంగా వైద్యచికిత్స
ఫ జిల్లాలోని 38 ఆస్పత్రుల్లో
నగదు రహిత వైద్యం


