కమ్మేసిన కరువు | - | Sakshi
Sakshi News home page

కమ్మేసిన కరువు

Oct 28 2026 6:06 AM | Updated on Oct 28 2026 6:06 AM

న్యూస్‌రీల్‌

కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు

బుధవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లాను కరువు కమ్మేసింది. దాదాపు జిల్లా అంతటా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్‌నినోతో వర్షాభావ, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, భూగర్భ జలాలు పడిపోవడం, సాగునీటి కొరత, భారీగా పంటలు ఎండిపోవడంతో ఆయా ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కరువు మండలాలుగా ప్రకటించింది. జిల్లాలోని నాలుగు మండలాల్లో తీవ్ర కరువు నెలకొందని పేర్కొంది. ఈ జాబితాలో కోదాడ నియోజకవర్గంలోని అనంతగిరి, చిలుకూరు, హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని పాలకీడు, చింతలపాలెం మండలాలు ఉన్నాయి. మిగతా 19 మండలాల్లోనూ మోస్తరు కరువు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే..

కేంద్ర ప్రభుత్వ కరువు నిర్వహణ మార్గదర్శకాల మేరకు వర్షపాతం, పంటల సాగు విస్తీర్ణం, భూగర్భ జలాలు, క్షేత్రస్థాయి పరిశీలన, ఉపగ్రహాల సంకేతాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. ఇందులో 14 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. సుదీర్ఘ కాలం పాటు వర్షాలు కురవకుండా పొడి వాతావరణం ఏర్పడిన మండలాలను ఎంపిక చేసింది. సాధారణ సాగు విస్తీర్ణంతో పోల్చితే వానాకాలం సీజన్‌లో ఏయే మండలాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందనే లెక్కలను సైతం ప్రభుత్వం సేకరించింది. దీనికి తోడు భూగర్భ జలాలు, తేమశాతం తదితర అంశాల ఆధారంగా జిల్లాలో నాలుగు మండలాల్లో తీవ్ర కరువు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. చింతలపాలెం మండలంలో లోటు వర్షపాతం 40 శాతం ఉండగా.. భూగర్భజలాలు అత్యంత లోటులో 18.51 మీటర్ల లోతులో ఉన్నాయి. పాలకీడులో 53 శాతం లోటు వర్షాపాతం ఉండగా.. చిలుకూరులో 40 శాతం, అనంతగిరిలో 30 శాతం లోటు వర్షపాతం నమోదైంది. భూగర్భ జలాలు 8.09 మీటర్ల లోతులో ఉన్నాయి.

మిగతా మండలాల్లోనూ కరువే..

ఎల్‌నినో పరిస్థితుల కారణంగా సెప్టెంబర్‌ చివరి నాటికే 14 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో 4 మండలాల్లో తీవ్ర కరువు ఉండగా.. మిగతా 19 మండలాల్లోనూ కరువు స్పష్టంగా ఉన్నట్లు జాబితాలో పేర్కొన్నారు. ఇందులో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలోని అన్ని మండలాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో లోటు వర్షపాతమే కాకుండా భూగర్భ జలాలు సైతం అడుగంటాయి. పంటలు ఎండిపోవడం, రానున్న వేసవిలో పంటల సాగుకు అనుకూల వాతావరణం లేకపోవడంతో ఈ మేరకు కరువు మండలాల జాబితాలో చేర్చింది. మొత్తంగా జిల్లా అంతటా కరువు నెలకొనడంతో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడింది. రానున్న రోజుల్లో అన్ని రంగాలపై కరువు ఛాయలు ప్రభావం చూపనున్నాయి.

ఫ 4 మండలాల్లో తీవ్రం..

19 చోట్ల సాధారణం

ఫ జాబితా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

ఫ తక్షణ సహాయక చర్యలకు ఆదేశం

కరువు ప్రభావిత మండలాల్లో తక్షణమే సహాయక చర్యలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఇందులో భాగంగా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా ఇన్‌ పుట్‌ సబ్సిడీని అందించాలని, తాగునీటి సరఫరాను పెంచాలని పేర్కొంది. అవసరమైన చోట పశుగ్రాసం ఏర్పాట్లతోపాటు, పశువుల శిబిరాలు నిర్వహించాలని పేర్కొంది. వీబీ జీరాంజీ కింద ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఆర్‌బీఐ మార్గదర్శకాల మేరకు వ్యవసాయ రుణాల పునర్‌వ్యవస్థీకరణ, బలవంతపు రుణ వసూళ్లను నిలిపివేయడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement