భానుపురి (సూర్యాపేట) : జనగణనలో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులు, చార్జ్ ఆఫీసర్లు, అదనపు చార్జ్ ఆఫీసర్లకు నిర్వహించిన శిక్షణా తరగతులను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జన గణన రెండో దశ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్, విధివిధానాలు, అధికారుల బాధ్యతలను వివరించారు. రెండో దశను 2027, జనవరి 10 నుంచి ఫిబ్రవరి 28 వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. జనవరి 10 నుంచి 24 వరకు స్వీయ గణన, జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ప్రతి ఇంటికి వెళ్లి గణన, ఫిబ్రవరి 28న ఇళ్లులేని వారిని గణించనున్నట్లు చెప్పారు. రివిజనల్ రౌండ్ మార్చి ఒకటో తేదీ నుంచి 5 వరకు ఉంటుందని తెలిపారు. జన గణనలో భాగంగా ఎన్యుమరేటర్లు ఇంటి యజమానిని కలిసి 40 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను సేకరిస్తారని, ప్రజలు సరైన సమాచారాన్ని అందించి సహకరించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, సీపీఓ కిషన్, జడ్పీ సీఈఓ శిరీష, ఆర్డీఓలు వేణుమాధవ్, శ్రీనివాసులు,సూర్యనారాయణ, ట్రైనర్లు ఓబులాల్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
వరి కోతలు వాయిదా వేసుకోండి
భానుపురి (సూర్యాపేట) : ఆర్నాబ్ తుపాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు మూడు రోజుల పాటు వరి కోతలు వాయిదా వేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. కోసిన ధాన్యం తడిస్తే తేమ శాతం పెరిగి నాణ్యత దెబ్బతినడంతో పాటు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు కోతలు చేపట్టవద్దని కోరారు. ఇప్పటికే వరి కోతలు పూర్తిచేసిన రైతులు ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచి, టార్పాలిన్లు, ఇతర కవర్లతో కప్పి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పిస్తు న్నారని తెలిపారు. రైతులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయశాఖ అధికారుల సూచనలు పాటించి పంట నష్టాన్ని నివారించుకోవాలని కలెక్టర్ కోరారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


