ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
సూర్యాపేటటౌన్ : గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిధుల కొరతతో నీరసిస్తున్నాయి. మూడేళ్లుగా హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ (హెచ్‌డీఎస్) నిధులు నిలిచిపోవడంతో ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, పరికరాలకు మరమ్మతులు, పారిశుద్ధ్య నిర్వహణ వంటివి అటకెక్కాయి. చిన్న చిన్న మరమ్మతులు చేయించేందుకు కూడా నిధులు లేకపోవడంతో వైద్యులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసరంగా చేయాల్సిన పనులు సైతం వాయిదా పడుతుండటంతో రోగులు సైతం అవస్థలు పడాల్సి వస్తున్నది.
జిల్లాలో 23 పీహెచ్‌సీలు
జిల్లాలో 23 పీహెచ్‌సీలతో పాటు మూడు అర్బన్‌న్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రతి ఏడాది రూ.1.75 లక్షల చొప్పున హెచ్‌డీఎస్ నిధులు కేటాయించాల్సి ఉంది. ఆసుపత్రుల్లో చిన్నపాటి మరమ్మతులు, విద్యుత్ పరికరాల నిర్వహణ, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య పనులకు ఈ నిధులను వినియోగించే వారు. మూడేళ్లుగా నిధులు విడుదల కాకపోవడంతో ఆయా పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. పీహెచ్‌సీలకు వచ్చే రోగులకు సైతం మౌళిక వసతులు కల్పించలేక పోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మూలన పడుతున్న పరికరాలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వినియోగించే ప్రింటర్లు, కంప్యూటర్లు, వాటర్ ఫిల్టర్లు మరమ్మతులకు గురైతే వాటిని బాగు చేయించేందుకు నిధులు లేక పోవడంతో పరికరాలు మూలనపడుతున్నాయి. పరీక్షల అనంతరం రోగులకు అందించాల్సిన నివేదికలను ప్రింట్ తీసి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే పరికరాలు సరిగా పనిచేయక పోవడంతో రోగుల సెల్‌ఫోన్లకు వాట్సాప్‌కు పంపిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు లేని వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫ్యాన్లు కాలిపోయినా, స్విచ్‌బోర్డులు పని చేయకున్నా, నల్లాలు పాడైనా మరమ్మతులు చేయించడం కష్టంగా మారుతోంది.
పేరుకుపోతున్న సమస్యలు...
కొన్ని పీహెచ్‌సీల ఆవరణలో పిచ్చిమొక్కలు పెరిగి అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోంది. దాంతో విషసర్పాలు, కీటకాల సంచారం అధికమవుతోందని సిబ్బంది, రోగులు వాపోతున్నారు. ఆసుపత్రుల గోడల రంగులు వెలిసిపోవడం, సూచిక బోర్డులు దెబ్బతినడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. తాగునీటి పైపులైన్లు, మోటార్లు మరమ్మతులకు గురైన చోట నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతోంది. కొన్ని సందర్భాల్లో వైద్యులు, సిబ్బంది సొంత డబ్బులు వెచ్చించి మరమ్మతులు చేయించుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు.
పీహెచ్‌సీలకు అభివృద్ది నిధులు రాకపోవడం వాస్తవమే. నిధులు లేక పీహెచ్‌సీల్లో చిన్న చిన్న పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నిధులు విడుదలైతే ఆసుపత్రుల్లోని సమస్యలను వెంటనే పరిష్కరించే అవకాశం ఉంటుంది.
–డాక్టర్ పెండెం వెంకటరమణ, డీఎంహెచ్‌ఓ
ఫ మూడేళ్లుగా
హెచ్‌డీఎస్ నిధులకు బ్రేక్
ఫ పీహెచ్‌సీల్లో మౌలిక వసతులు కరువు
ఫ మరమ్మతులకు నోచని పరికరాలు
ఫ ఇబ్బంది పడుతున్న ఆస్పత్రికి వచ్చే రోగులు, సిబ్బంది


