ఏర్పాట్ల పరిశీలన
కోదాడ: కోదాడ పట్టణంలో శనివారం నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు అధికారులు, నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు జాబ్ మేళా కొనసాగనుంది. హాజరయ్యే అభ్యర్థులు పేర్ల నమోదుకు అధికారులు క్యూఆర్ కోడ్‌ను రూపొందించారు. శుక్రవారం రాత్రి వరకు 50 వేల మందికి పైగా అభ్యర్థులతో పాటు 354 కంపెనీలు తమ పేర్లను నమోదు చేసుకొన్నాయి. కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎమ్మెల్యే పద్మావతి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
క్యూఆర్ కోడ్‌తో నమోదు
మెగా జాబ్ మేళాలో పాల్గొనదలచుకున్న అభ్యర్థులు క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలని అధికారులు ప్రకటించారు. ఆ మేరకు విస్తృత ప్రచారం నిర్వహించారు. గురువారం వరకు 10 వేల మంది మాత్రమే నమోదు కాగా శుక్రవారం ఒక్కరోజులోనే 40 వేల మందికి పైగా ఆన్‌లైన్‌లో పేర్లను నమోదు చేసుకున్నారు. శనివారం ఉదయం వరకు అవకాశం ఉండడంతో ఈ సంఖ్య 60 వేల వరకు చేరుకోనుందని నిర్వాహకులు చెబుతున్నారు.
హాజరు కానున్న ప్రముఖులు
కోదాడలో శనివారం జరిగే మెగా జాబ్ మేళాకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాదరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డి. శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్ హాజరు కానున్నట్లు రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం విలేకరులకు తెలిపారు.
వచ్చిన వారందరికీ భోజనాలు
పట్టణంలోని సీసీ రెడ్డి విద్యానిలయంలో జరిగే మెగా జాబ్ మేళాలో పాల్గొనే వారందరికీ మధ్యాహ్న భోజనం అందించనున్నారు. ఈ మేరకు విద్యాలయం పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం క్రాస్‌రోడ్డు నుంచి ట్రాఫిక్‌ను నియంత్రించనున్నారు. పట్టణంలోని వేర్వేరు ప్రదేశాల్లో వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను బైపాస్ రోడ్డు మీదుగా మళ్లిస్తున్నారు. ఖమ్మం క్రాస్‌రోడ్డులో దుకా ణాలను కూడా మూసివేయిస్తున్నారు. జాబ్‌మేళా పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ఇందుకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.
మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్న కోదాడలోని సీసీరెడ్డి విద్యానిలయాన్ని శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి ఎమ్మెల్యే పద్మావతి సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు. ఉద్యోగ మేళాకు 50 వేల మందికి పైగా అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకున్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులను ఆమె కోరారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఫ 50 వేలకు పైగా అభ్యర్థులు,
354 కంపెనీలు రిజిస్టర్
ఫ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు, నిర్వాహకులు
ఫ హాజరు కానున్న శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు
ఫ కోదాడ పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు


