సూర్యాపేట : బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్, నాసిక్, పుణె, ఏపీలోని కర్నూలు నుంచి ఉల్లి దిగుమతి అవుతోంది. ప్రస్తుతం దిగుమతులు తగ్గడంతో రేట్లు అమాంతం పెరిగాయి. మార్కెట్లో కిలో ఉల్లి రూ.70 పలుకుతోంది.
తగ్గిన దిగుబడులు
ఈ ఏడాది జూన్ వరకు ఉల్లి ఎగుమతులకు అవకాశం లేకుండా పోవడంతో వాటి రేట్లు కిలో రూ.12 నుంచి రూ.15 వరకు మాత్రమే ఉండేది. జూలై మొదటి వారం నుంచి విదేశాలకు ఎగుమతులు ప్రారంభమయ్యాయి. దానికి తోడు ఈ ఏడాది ఉల్లి దిగుబడులు సైతం తగ్గాయి. దాంతో ప్రస్తుతం ఉల్లికి డిమాండ్ పెరిగింది. మహారాష్ట్ర నుంచి జిల్లాలోని పలు ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. రవాణా చార్జీలు, హమాలీ, అన్ లోడింగ్ చార్జీలు ఇలా అన్ని ఖర్చులు కలుపుకొని ఆ భారమంతా వినియోగదారులపై పడుతోంది. ఒకవైపు మహారాష్ట్రలో కొత్త పంట లేదు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలోనూ సాగు చేయలేదు. కర్నూలు జిల్లాలో ఇప్పుడిప్పుడే వస్తున్న కొత్త పంటను పెద్దఎత్తున నిల్వ ఉంచితే కుళ్లిపోయే అవకాశం ఉండడంతో టోకు వ్యాపారులు దిగుమతికి ముందుకు రావడం లేదు.
రోజుకు 5లారీలు
సూర్యాపేట జిల్లాకు 5 నుంచి 6 లారీల చొప్పున ఉల్లిగడ్డలు దిగుమతి అవుతున్నాయి. పంట తక్కువగా ఉండడం, కృత్రిమ కొరత కారణంగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి.
ఫ కిలో రూ.70కు చేరిన ధర
ఫ తగ్గిన దిగుబడితో పెరుగుతున్న రేటు


