సూర్యాపేట అర్బన్ : వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో పాటు ఆనందంగా జరుపుకోవడానికి ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ సూర్యాపేట ఎస్‌ఈ పి.యాదగిరి సూచించారు. గణేష్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా సమన్వయంతో వ్యవహరిస్తున్నామన్నారు. మండప నిర్వాహకులు తమకు సమాచారం అందిస్తే స్వయంగా విద్యుత్ కనెక్షన్ ఇప్పిస్తామని చెప్పారు. నిరంతరం ప్రత్యేక బృందం అందుబాటులో ఉంటుందని చెప్పారు. మండపాల వద్ద విద్యుత్ నిర్వహణపై ఆయన పలు సూచనలు చేశారు.
నాసిరకం వైర్లు వద్దు
మండపాల వద్ద షార్ట్ సర్క్యూట్ వంటి అనర్ధాలు తలెత్తకుండా నిర్వాహకులు నాణ్యమైన వైర్లను వినియోగించాలని సూచించారు. ఉత్సవ కమిటీ వారు సమాచారం అందిస్తే విద్యుత్‌శాఖ సిబ్బంది వచ్చి విద్యుత్ కనెక్షన్ ఇస్తారని, ప్రభుత్వం కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. కొంతమంది సమాచారం ఇవ్వకుండా నేరుగా కనెక్షన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, అలా చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.
తడి చేతులతో తాకవద్దు
మండపాల్లో ఐఎస్‌ఐ మార్కు ఉన్న విద్యుత్ వైర్లను వినియోగించాలి, ఒక ఫ్లగ్‌కు ఎక్కువ కనెక్షన్లు ఇచ్చి ఓవర్ లోడ్ వేయవద్దని సూచించారు. తడిచేతులతో విద్యుత్ పరికరాలను తాకకూడదని, పిల్లలను వైర్లకు దూరంగా ఉంచాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా తీగలు తెగిపడినా.. అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే తమకు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అందరి భాగ స్వామ్యంతో ఉత్సవాలను ఆనందంగా, ఆటంకాలు లేకుండా జరుపుకోవాలని సూచించారు.
ఎత్తైన విగ్రహాలు
తరలిస్తే సమాచారం ఇవ్వాలి
మండపాల వద్దకు పది అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న విగ్రహాలు తీసుకువస్తే విద్యుత్‌శాఖ అధికారులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని, ఆ మార్గంలో తక్కువ ఎత్తులో విద్యుత్ వైర్లు ఉంటే ముందస్తు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా విద్యుత్ వైర్లను కర్రలతో లేపే ప్రయత్నం చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి సహకారం పొందవచ్చన్నారు.
ఫ గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్
ఫ సమాచారం అందిస్తే సిబ్బందే వచ్చి
కనెక్షన్ ఇస్తారు
ఫ ఎత్తైన విగ్రహాలు తరలిస్తే విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాలి
ఫ ట్రాన్స్‌కో ఎస్‌ఈ యాదగిరి


