మునగాల: మండలంలోని ఈదులవాగు తండా గ్రామ పంచాయతీ పరిధిలో రూ.4కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్రాజెక్ట్‌కు అవసరమైన ప్రభుత్వ భూములను శుక్రవారం అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్‌డీఓ ఆర్. సన్యాసయ్య మాట్లాడుతూ సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు నాలుగు నుంచి 8 ఎకరాల భూమి కావల్సి ఉంటుందని, గ్రామంలోని ప్రభుత్వ భూమి ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుకు అనువుగా ఉంటుందన్నారు. భూమికి సంబంధించిన పూర్తి వివరాలను తహసీల్దార్ నుంచి తీసుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సురేష్, ప్రాజెక్ట్ జిల్లా మేనేజర్ అరుణ్‌కుమార్, ఏపీఎం కరుణాకర్, సీసీ సాంబయ్య, పంచాయతీ కార్యదర్శి నరేష్, తదితరులు ఉన్నారు.
ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యం
నడిగూడెం : మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు తమకున్న భూమిలోంచి అర ఎకరంలో ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని ఆత్మ ప్రాజెక్టు డిప్యూటీ డైరక్టర్ నివేదిత సూచించారు. మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన రైతు వాసికర్ల శేషుకుమార్ వ్యవసాయ క్షేత్రంలో నారాయణపురం, సిరిపురం గ్రామాలకు చెందిన మహిళా రైతులకు ఆత్మ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వ్యవసాయ భూమి లేని మహిళలు ఇళ్లల్లో ఉన్న ఖాళీ స్థలాలలో కూరగాయలు పండించాలని సూచించారు. ఈ సందర్భంగా అభ్యుదయ రైతు వాసికర్ల శేషు కుమార్ తాను ఎకరంన్నర విస్తీర్ణంలో 40 రకాల పంటలను ప్రకృతి సిద్ధంగా సాగు చేస్తున్న విధానాన్ని రైతులకు వివరించారు. కార్యక్రమంలో కోదాడ వ్యవసాయ సహాయ సంచాలకురాలు స్రవంతి, ఏఓ గోలి మల్సూర్, ఏఈఓలు రేణుక, ఉమేష్, వెంకటరెడ్డి, ఉపేందర్, మహిళా రైతులు పాల్గొన్నారు.
దాత సాయంతో
నిరాశ్రయులకు గూడు
గరిడేపల్లి : మండలంలోని కల్మలచెరువు గ్రామానికి చెందిన సట్టు సోమమ్మ నిరుపేద కావడం, సొంతిల్లు లేక పోవడంతో తన కూతురు ఆదిలక్ష్మితో కలిసి గ్రామంలోని సత్రంలో ఉంటున్నది. 15 సంవత్సరాలుగా తల్లీ కూతుళ్లు గ్రామంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి పరిస్థితిని చూసి చలించిన దాత ఏవీరెడ్డి రూ.70వేలు ఖర్చుచేసి తల్లీ కూతుళ్లకు సొంతింటిని నిర్మించి శుక్రవారం అందించారు. నిరాశ్రయులుగా జీవనం సాగిస్తున్న తల్లీ బిడ్డకు సొంతింటిని అందించిన ఏవీ రెడ్డిని సర్పంచ్ బచ్చలకూర శ్రీను అభినందించారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ గుత్తికొండ ప్రమీల వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచ్ అంజయ్య, మాజీ కో–ఆప్షన్ సభ్యుడు షేక్ దస్తగిరి, వార్డు సభ్యులు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.


