సూర్యాపేట : రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించకుంటే రైతులతో కలిసి జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హెచ్చరించారు. విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విద్యుత్ అందించి రైతులను ఆదుకోవాలనే కనీస ఆలోచన, చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. రైతులు అప్పులు చేసి బోర్ల కింద నాట్లు వేసుకుంటే, కరెంటు సరిగా రాక కళ్ల ముందే పచ్చని పంటలు ఎండిపోతుంటే కన్నీరుమున్నీరు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో కనురెప్ప పాటు కూడా కరెంటు పోలేదని, కానీ ప్రస్తుతం ఎప్పుడు కరెంటు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. వరి కోతలు పూర్తయ్యే వరకు ఎడమ కాల్వ ఆయకట్టుకు సాగర్ నీటిని ఏ విధంగా ఇస్తారో వెంటనే షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 14లోపు క్యాలెండర్ ప్రకటించకపోతే పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఎస్‌ఈకి వినతిపత్రం అందించారు. ఉన్నతాధికారులతో, మంత్రులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని ఎస్‌ఈ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్


