పాలకవీడు: రెండేళ్లుగా అద్దె బకాయి చెల్లించకపోవడంతో భవన యజమాని తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేశాడు. ఈ ఘటన పాలకవీడు మండలంలో గురువారం చోటుచేసుకుంది. తన కుటుంబ ఆర్థిక అవసరాలకు ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో తాను నివసిస్తున్న ఇంటిని తహసీల్దార్ కార్యాలయానికి అద్దెకు ఇచ్చాడు. నెలకు రూ.13,800 చొప్పున 24 నెలలకు రూ.3,31,000 అద్దె బకాయి రావాల్సి ఉందని భవన యజమాని తెలిపాడు. ఉన్న అద్దైపె ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 5 శాతం చొప్పున అద్దె పెంచుతామని 2016లో ఒప్పదం కుదుర్చుకున్నట్లు చెప్పాడు. గత రెండేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యలయాల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదని, గత్యంతరం లేక కార్యాలయానికి తాళం వేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. దీనిపై తహసీల్దార్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారులతో మాట్లాడి, బకాయిలో 50 శాతం అద్దె చెల్లించినట్లు, మిగిలిన అద్దె త్వరలో చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో యజమాని గేటుకు తాళం తీసినట్లు పేర్కొన్నారు.


