ఇతర కీలక శాఖల్లోనూ ఇదే తీరు
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో కొందరు అధికారుల తీరు విస్తూ పోయేలా ఉంది. అక్రమ సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నారు. భూములు ఏవైనా జేబు నింపితే చాలు అనుమతులు ఇచ్చేద్దాం అన్న తీరుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ జీఓలు, చట్టాలను ఆసరాగా చేసుకుని కబ్జాకు పాల్పడిన ప్రభుత్వ భూములు, నిషిద్ధ భూములను సైతం దర్జాగా పట్టాలు చేస్తున్నారు. ఇదే సమయంలో సామాన్య జనం చిన్నచిన్న కారణాలతో కార్యాలయాల చుట్టూ తిరిగిన వారికి మాత్రం పనులు చేయడం లేదు. ఇలా అక్రమాలకు పాల్పడుతూ ఏదో ఒక సమయంలో ఏసీబీకి అడ్డంగా దొరికిపోతున్నారు. వీరే కాకుండా చాలామంది అధికారులు దొరికితే దొంగ లేదంటే దొరలా జిల్లాలో తమ పనులు కానిస్తున్నారు.
అక్రమంగా అనుమతులు..
సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాలిటీలైన కోదాడ, హుజూర్‌నగర్, తిరుమలగిరి, నేరేడుచర్లలో ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇళ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. అయితే మున్సిపాలిటీ అధికారులు మాత్రం తమ చేయి తడిపితే అనుమతులు ఇచ్చేసి వారు ఏ విధంగా ఇంటి నిర్మాణాలు చేపట్టినా కూడా అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొంటుంది. మున్సిపాలిటీల పరిధిలో వ్యవసాయ భూములుగా ఉండి, వ్యవసాయేతర భూములుగా కన్వర్ట్ కానప్పటికీ ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. వీటికి ప్రభుత్వం నిబంధనలు అనుమతించకపోయినప్పటికీ పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
రెవెన్యూ విభాగంలోనూ..
కోర్టు కేసులు, వివాదాస్పద భూములకు సైతం సంబంధిత అధికారులు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుంటూ ఏకపక్షంగా అనుమతులు ఇచ్చేస్తున్నారు. అక్రమంగా పట్టా చేసే వ్యవసాయ భూములు ఎన్ని ఎకరాల్లో ఉంది.. ఎంత వసూలు చేయాలన్నది ఒక్కోదానికి ఒక్కో రేటు కట్టి వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతుండగా కొన్ని కొన్ని సందర్భాల్లో అధికారులు, మధ్యవర్తులు, వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకునే వారి మధ్య తలెత్తే వివాదాల కారణంగా బయటికి పొక్కుతున్నాయి. లేదంటే జేబులు నింపుకుంటూ అక్రమ పట్టాలను సైతం దర్జాగా కానిచ్చేస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లి కొందరు సస్పెండ్ అవుతుండగా మరికొందరు ఏసీబీకి చిక్కుతున్నారు.
ఫ డబ్బులిస్తే ప్రభుత్వ నిషేధ
భూముల్లో నిర్మాణాలకు అనుమతులు
ఫ కబ్జాకు పాల్పడిన భూములు, నిషిద్ధ భూములకు సైతం దర్జాగా పట్టాలు
ఫ అన్ని అనుమతులు ఉన్న
వారికి మాత్రం కొర్రీలతో సతాయింపు
జిల్లాలోని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలు, పోలీస్ శాఖలో ఉన్న అధికారులు సైతం ఇదేవిధంగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక అన్ని శాఖల్లోనూ ప్లానింగ్ అధికారులు ఒక్కో పనికి ఒక్కో రేట్లు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు. జిల్లా ప్లానింగ్ కార్యాలయం, ట్రెజరీ కార్యాలయంలో చేయితడపనిది పనులు కావట్లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.


