రామగిరి(నల్లగొండ) : పాలిటెక్నిక్ విద్యలో శక్తి ప్రోగ్రామ్‌ను కలపవద్దని, తక్షణమే జీవో నంబర్ 97ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు మండిపడ్డారు. గురువారం నల్లగొండలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు మహాధర్నా, భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. విద్యార్థుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఐదు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. శక్తి విధానం వల్ల పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్‌కు దూరమయ్యే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 97 విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసేలా ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ జీవోను రద్దు చేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఫ నల్లగొండలో పాలిటెక్నిక్ విద్యార్థుల
మహా ధర్నా, ర్యాలీ


