వానాకాలంలోనూ నీటి తిప్పలు | - | Sakshi
Sakshi News home page

వానాకాలంలోనూ నీటి తిప్పలు

Sep 5 2026 7:31 AM | Updated on Sep 5 2026 7:31 AM

నీటి సమస్య రాకుండా చూస్తాం నీటి సరఫరా సమయాన్ని పెంచాలి

మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు నీటి సమస్య రాకుండా చూస్తాం. సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం. నీటి సమస్య ఉన్న ప్రాంత ప్రజలు నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలి.

– సీహెచ్‌.హనుమంతరెడ్డి,

మున్సిపల్‌ కమిషనర్‌, సూర్యాపేట

మున్సిపాలిటీ నీరు ఇవ్వాల్సిన సమయం కంటే తక్కువగా ఇస్తున్నారు. నీటి సరఫరా సమయాన్ని పెంచాలి. ఎంత పొదుపుగా వాడుకున్నా నీరు సరిపోవడం లేదు. అధికారులు స్పందించి నీటి సరఫరాలో జాప్యం లేకుండా చూడాలి.

– సరగం వెంకటమ్మ, స్నేహనగర్‌ వాసి

సూర్యాపేట అర్బన్‌ : వానాకాలంలోనూ సూర్యాపేట పట్టణ ప్రజల తాగునీటి కోసం తిప్పలు పడుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వరుణుడు కరుణించకపోవడం, భూగర్భ జలాలు అడుగంటడం, ఇళ్లల్లోని బోర్లు సైతం వట్టిపోయాయి. దీనికి తోడు మున్సిపల్‌ నీటి సరఫరాలోనూ తరచూ అంతరాయం ఏర్పడుతుండడంతో పట్టణ వాసులు గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్నారు. ఏ వార్డులో ఎప్పుడు, ఎంతసేపు నీళ్లు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు. ఫలితంగా తాగునీటి కోసం సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తేనే..

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 48 వార్డులు, సుమారు 39వేల నివాసాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 17,500 ఇళ్లకు మున్సిపల్‌ నల్లా కనెక్షన్లు ఉండగా, మిగతా కుటుంబాలు బోర్ల మీదే ఆధారపడుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం బోర్లు ఎండిపోవడంతో ఆయా కుటుంబాల వారు సైతం మున్సిపాలిటీ నీటిపైనే ఆధార పడుతున్నారు. ఎల్‌నినో పరిస్థితి నేపథ్యంలో మున్సిపాలిటీ వారు ఎక్కువ సమయం నీటిని సరఫరా చేయలేకపోతున్నారు. దీనికి పైప్‌లైన్ల లీకేజీలు కూడా తోడవడంతో ప్రజల నీటి కష్టాలు రెట్టింపయ్యాయి. వచ్చే ఆ కాస్త నీటిని ఎంత పొదుపుగా వాడుకున్నా సరిపోవడం లేదని, సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా అయినా నీటిని సరఫరా చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.

తరచూ లీకేజీ సమస్యలు

మిర్యాలగూడ సమీపంలోని అవంతీపురం మిషన్‌ భగీరథ ప్రాజెక్టు నుంచి పైప్‌లైన్ల ద్వారా ఇమాంపేటకు, అక్కడి నుంచి సూర్యాపేట పట్టణానికి కృష్ణా జలాలు సరఫరా అవుతున్నాయి. అవంతీపురం పంప్‌హౌస్‌లో మోటార్ల సమస్యలు, విద్యుత్‌ అంతరాయం, పైప్‌లైన్ల లీకేజీలు, వాల్వ్‌ పైపు వద్ద గ్యాస్కెట్‌ ఫెయిల్‌ వంటి సాంకేతిక సమస్యలు తలెత్తిన ప్రతిసారి సూర్యాపేటకు నీటి సరఫరా నిలిచిపోతోంది. ఇమాంపేట ప్రాజెక్టు వద్ద కూడా తరచూ ఇలాంటి సమస్యలే తలెత్తుతున్నాయి. పైప్‌లైన్ల లీకేజీల సమయంలో అధికారులు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తేనే..

కేవలం మిషన్‌ భగీరథపైనే ఆధారపడకుండా పట్టణానికి ప్రత్యామ్నాయ నీటి వనరులను సిద్ధం చేయాలనే డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. గతంలో సూర్యాపేటకు నీటిని అందించిన దోసపహాడ్‌, మూసీ ప్రాజెక్టులను పునరుద్ధరించి అవసరమైన మేరకు వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

ఫ సూర్యాపేటలో తాగు నీటికి

అల్లాడుతున్న ప్రజలు

ఫ వర్షాభావంతో అడుగంటిన బోర్లు

ఫ మున్సిపల్‌ నీటి సరఫరాలోనూ తరచూ అంతరాయం

ఫ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజల వేడుకోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement