డిపాజిట్‌ గల్లంతు! | - | Sakshi
Sakshi News home page

డిపాజిట్‌ గల్లంతు!

Sep 5 2026 7:31 AM | Updated on Sep 5 2026 7:31 AM

నిబంధనల ప్రకారం ఇస్తాం

పంచాయతీ ఎన్నికల్లో డిపాజిట్‌ దక్కించుకున్న వారికి తిరిగిరాని సొమ్ము

ఎన్నికలు ముగిసి సంవత్సరం కావస్తున్నా ఇదే పరిస్థితి

అవగాహనలేక అటువైపు వెళ్లని అభ్యర్థులు

అడిగిన వారికి మాత్రమే

ఇస్తున్న అధికారులు

మిగతా సొమ్ముకు లెక్కలు కరువు

భానుపురి (సూర్యాపేట) : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు చెల్లించిన ధరావతు (డిపాజిట్‌) సొమ్ము అధికారుల నిర్లక్ష్య, అభ్యర్థుల అవగాహనా రాహిత్యంతో గల్లంతవుతోంది. నిబంధనల ప్రకారం ఎన్నికల అనంతరం అర్హులైన అభ్యర్థులకు తిరిగి చెల్లించాల్సిన రూ.లక్షలాది డిపాజిట్‌ సొమ్ముకు అధికారులు లెక్కలు చూపడం లేదు. దీనిపై పోటీ చేసిన అభ్యర్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఈ డబ్బంతా ఎటు పోయిందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది.

జిల్లాలో 1,346 మంది పోటీ

జిల్లాలో 2025 డిసెంబర్‌లో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలను అధికారులు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 486 గ్రామపంచాయతీలు, 4,388 వార్డులకు గాను.. సర్పంచ్‌ అభ్యర్థులుగా 1,346 మంది, వార్డు మెంబర్లుగా 15,000 మందికి పైగా పోటీ చేశారు. వీరంతా ఎన్నికల సంఘం సూచించిన మేరకు డిపాజిట్‌ సొమ్ము చెల్లించారు. అయితే ఈ డబ్బులు తిరిగి వస్తాయన్న కనీస అవగాహన అభ్యర్థులకు లేకపోవడం, అధికారులు కూడా ఆ విషయమై స్పందించకపోవడంతో గెలిచిన వారితో పాటు, డిపాజిట్‌ దక్కించుకున్న ఓడిపోయిన అభ్యర్థులు కూడా సొమ్మును తిరిగి పొందేందుకు ముందుకు రాలేదు. డిపాజిట్‌ సోమ్మును అధికారులు సొంతానికి వాడుకుంటున్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి.

అడిగిన వారికి మాత్రమే..

ఎన్నికల నిబంధనల ప్రకారం సర్పంచ్‌గా పోటీచేసే జనరల్‌ అభ్యర్థులు రూ.2వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.వెయ్యి చొప్పున డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. వార్డు సభ్యులుగా పోటీ చేసే జనరల్‌ అభ్యర్థులు రూ.500, నియోజకవర్గ రిజర్వుడ్‌ అభ్యర్థులు రూ.250 చెల్లించారు. ఒక్కో అభ్యర్థి చేసే చిన్న మొత్తాలను జిల్లా వ్యాప్తంగా లెక్కగడితే రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు అవుతున్నాయి. ఈ నిధులన్నీ ప్రస్తుతం ఎంపీడీఓల పరిధిలో ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం అవగాహన ఉండి, ఎన్నికల ఖర్చుల లెక్కలు చూపించి అడిగిన వారికి మాత్రమే అధికారులు డిపాజిట్‌ తిరిగి ఇస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో చెల్లుబాటైన ఓట్లలో డిపాజిట్‌ దక్కించుకున్న వారికి, విజయం సాధించిన అభ్యర్థులకు మాత్రమే డిపాజిట్‌ డబ్బులు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఎంపీడీఓ కార్యాలయంలో అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల లెక్కలను నిబంధనల ప్రకారం సమర్పించి, తమ ధరావతు సొమ్మును తిరిగి పొందవచ్చు.

–యాదగిరి, డీపీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement