కోదాడరూరల్ : వ్యవసాయాని కోతలు లేకుండా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం నాయకులు శుక్రవారం పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్‌లో గల సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ఉపాధ్యక్షుడు బొల్లు ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే దానికి తోడు ప్రభుత్వం కరెంట్ కోతలు పెడుతూ రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తుందన్నారు. బావులు, బోర్ల కింద సాగు చేసిన పంటలు విద్యుత్ కోతలతో ఎండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, పాలకులు స్పందించి వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. అనంతరం ఏడీఈకి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో రైతులు బొల్లు రామకృష్ణ, పోటు నరేష్, సామినేని సుబ్బారావు, శేషయ్య, వెంకటేశ్వర్లు, పూర్ణచందర్‌రావు, వెంకట్రామయ్య, బొల్లు నరేష్ తదితరులు పాల్గొన్నారు.
అథ్లెటిక్స్‌లో మోతె
వాసికి బంగారు పతకం
మోతె : పంజాబ్ రాష్ట్రం లుథియానాలో ఈ నెల ఒకటో తేదీ నుంచి 3 వరకు జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మోతె మండల కేంద్రానికి చెందిన అప్పల వరుణ్ సత్తా చాటాడు. 1000 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు. దాంతో పాటు 400 మీటర్ల రన్నింగ్ రేస్‌లో ఏడో స్థానంలో నిలిచాడు. వరుణ్ ప్రస్తుతం సూర్యాపేటలోని జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. జాతీయ స్థాయిలో పతకం సాధించిన వరుణ్‌ను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, కళాశాల అధ్యాపకులు అభినందించారు.
రేపటి నుంచి ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు
తుంగతుర్తి : ఈ నెల 6, 7, 8 తేదీల్లో కరీంనగర్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభలు జరుగనున్నట్లు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోతు రాజారాం నాయక్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 6న భారీ కార్మిక ప్రదర్శన, 7, 8 తేదీల్లో ప్రతినిధుల మహాసభలు ఉంటాయన్నారు. మహా సభలకు కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు బొంకూరు శ్యాంసుందర్, నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు కోట రామస్వామి, నర్సయ్య, నజీర్, వెంకన్న, ఆంధ్రయ్య, హైమద్, ఖదీర్, శ్రీనివాస్, సత్యం, భిక్షపతి, యాకుబ్, సైదులు పాల్గొన్నారు.
రాజవరం మేజర్‌కు గండి
తిరుమలగిరి (సాగర్) : నాగార్జునసాగర్ ఎడమ కాలువ మొదటి మేజర్ రాజవరం కాలువకు అల్వాల గ్రామ సమీపంలో శుక్రవారం భారీ గండి పడింది. దీంతో కాలువ నీరంతా వృథాగా పొలాల్లో పారుతోంది. సాగర్ ఆయకట్టు పరిధిలో తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు, భూగర్భ జలాలు పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసింది. ఈ క్రమంలో అల్వాల సమీపంలో మేజర్ కాలువకు భారీ గండి పడడంతో నీళ్లన్నీ వృథా అవుతున్నాయి. సాగర్‌జలాలు విడుదలైన నాటినుంచి ఇప్పటివరకు చెరువుల్లోకి సగం నీరు కూడా చేరలేదని, ఇప్పుడు గండి పడి నీరంతా వృథా అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మేజర్‌కు నీటిని బంద్ చేశారు. గండిని పూడ్చి, చెరువులు నింపాలని రైతులు కోరుతున్నారు.


