చిలుకూరు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ శుక్రవారం మండలంలోని బేతవోలు గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వంటా – వార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచేందుకు ఆరు గ్యారంటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాటిని గాలికొదిలేసిందన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్లు పెంచుతామని ఇచ్చిన హామీ నెరవేర్చక పోగా సదరం క్యాంపులో సర్టిఫికెట్లు పొందాలంటే దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెరిగిందని, నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగి సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలను గాలికొదిలేసిన మంత్రులు హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అక్కినపల్లి జానకీరామాచారి, మాజీ జడ్పీటీసీ భట్టు శివాజీనాయర్, చిలుకూరు ఫ్యాక్స్ చైర్మన్ అలసకాని జనార్దన్, పార్టీ జిల్లా నాయకుడు తాళ్లూరి శ్రీను పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే బొల్లం
మల్లయ్య యాదవ్


