సూర్యాపేటటౌన్ : బాధ్యతాయుతమైన అధి కారిగా ఉండి ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తున్న డీఈఓపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్‌వర్మ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వీఎన్ భవన్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యం అవుతుందని, క్రమేపి ప్రభుత్వ పాఠశాలల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అన్నారు. ప్రభుత్వ విద్యరంగాన్ని కాపాడాల్సిన అధికారులే ప్రైవేటు వారిని ప్రోత్సహించడం సరికాదన్నారు. కార్యక్రమంలో నాయకులు పులుసు దిలీప్, సింహాద్రి, పిడమర్తి భరత్, అఖిల్, ఆవుల నాగరాజు, మట్టిపల్లి సైదులు, వీరబోయిన లింగయ్య, పోలోజు మహేష్ చారీ, జనార్దన్, వినయ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
యువత మత్తుకు
బానిస కావొద్దు
సూర్యాపేటటౌన్ : సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతున్న నేప థ్యంలో యువత వాటికి బానిస కాకుండా ఉండేందుకు పోలీసులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో పోలీసుల పాత్ర ఎంత ముఖ్యమో, అదే స్థాయిలో యువత, తల్లిదండ్రులు, ప్రతి వర్గం అంతే బాధ్యతగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ తయారీ, రవాణా, విక్రయాలపై రాష్ట్ర పోలీసు శాఖ ఇప్పటికే కఠిన చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. చట్టాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
పీహెచ్‌సీలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ప్రసవం
నేరేడుచర్ల : ప్రభుత్వ ఉపాధ్యాయురాలు డెలివరీ కోసం ఆదివారం నేరేడుచర్ల పీహెచ్‌సీకి రాగా.. సాధారణ ప్రసవం ద్వారా మగ బిడ్డకు జన్మనిచ్చింది. నేరేడుచర్లకు చెందిన శ్రీవల్లి నిడమనూరు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తుండగా ఆమె భర్త వినోద్ పాలకీడు మండలం కల్మెట్‌తండా ప్రభుత్వ పాఠశాలలో ఎస్‌జీటీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇరువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు అయినప్పటికీ ప్రభుత్వ వైద్య సేవలపై నమ్మకంతో శ్రీవల్లిఇ డెలివరీ కోసం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరింది. వైద్యాధికారి డాక్టర్ పున్నా నాగిని ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఆమెకు సాధారణ ప్రసవం చేశారు.
యాదగిరి క్షేత్రంలో
సుదర్శన హోమం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి పుణ్యక్షేత్రంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా జరిపించారు. ఆదివారం వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం సంప్రదాయంగా నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలు చేపట్టారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజను సంప్రదాయంగా జరిపించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధిలో స్వామి అమ్మవార్ల జోడు సేవ నిర్వహించారు.


