చిలుకూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై యువత తిరుగుబాటు చేస్తోందని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అన్నారు. ఆదివారం చిలుకూరు మండల కేంద్రంలోని కస్తూరి అప్పారావు హాల్‌లో నిర్వహించిన ఏఐవైఎఫ్ మూడో రాష్ట్ర మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అభివృద్ధి పేరుతో దేశాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు భవిష్యత్తులో ప్రమాదకరమన్నారు. రాజకీయ పార్టీలు యువతను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయని మండిపడ్డారు. యువతకు విద్య, వైద్యం, ఉపాధి హక్కులు దక్కాలంటే మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాలే శరణ్యమన్నారు. సూర్యాపేట జిల్లాలో పరిశ్రమల కొరత ఉందని, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జాప్యం జరుగుతుండటంతో నిరుద్యోగ యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ ఖాళీలు ప్రకటించి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ ఉమ్మడి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేకల శ్రీనివాసరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయనాయుడు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి చేపూరి కొండలు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడెల్లి శ్రీకాంత్, నాయకులు లింగరాజు, సైదులు, వీరన్న, బద్దం కృష్ణారెడ్డి, షేక్ సాహెబ్ అలీ, మండవ వెంకటేశ్వర్లు, లతీఫ్, గుండు వెంకటేశ్వర్లు, బత్తిని హనుమంతరావు, పిల్లుట్ల కనకయ్య, రెమిడాల రాజు, చిలువేరు ఆంజనేయులు పాల్గొన్నారు.
ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర


